ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఎంత ప్రాణనష్టం జరిగిందంటే?

by Phanindra |   (  Updated:2025-06-19 18:01:52  IST  )

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరింది.ఈ యుద్ధంలో రెండు దేశాల్లో ఎంత ప్రాణనష్టం జరిగిందంటే..?

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఎంత ప్రాణనష్టం జరిగిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరింది. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాలు ఒకదానిపై మరొకటి మిసైల్స్, డ్రోన్స్‌తో దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్‌లో 639 మంది మరణించినట్లు అంచనా. వీరిలో 263 మంది సామాన్య ప్రజలేనని ఇరాన్ చెప్తోంది. అలాగే 2500 మందికిపైగా గాయాలపాలయ్యారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఇరాన్ చేసిన దాడుల్లో తమకు భారీగా ప్రాణనష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. తమ దేశంలో ఇరాన్ దాడుల్లో 24 మంది మరణించగా.. సుమారు 2400 మంది ఆస్పత్రిపాలయ్యారని, వీరిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. తాము కేవలం ఇరాన్‌లోని న్యూక్లియర్ వసతులు, మిలిటరీ స్థావరాలనే టార్గెట్ చేస్తుంటే.. ఇరాన్ మాత్రం సాధారణ ప్రజలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. తాజాగా టెల్ అవీవ్‌ సమీపంలోని ఒక ఆస్పత్రిపై ఇరాన్ మిసైల్ దాడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరిందనే చెప్పాలి.

ఇజ్రాయెల్ ఎటాక్స్..

ఇరాన్‌పై భారీగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. తాజాగా ఇరాన్‌లోని అరక్ హెవీ వాటర్ రియాక్టర్‌ను టార్గెట్ చేసింది. దీంతో ఇరాన్‌లో ప్లూటోనియం ఉత్పత్తికి బ్రేకులు వేయొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇప్పటికే ఇరాన్‌లోని బాలిస్టిక్ మిసైల్ లాంచర్స్‌లో మూడో వంతును నాశనం చేశామని ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్నాయి.

ఎన్ని మిసైల్స్ వేశారు?

ఈ యుద్ధం మొదలైన సమయంలో ఇరాన్ వద్ద మొత్తం 2000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని ఇజ్రాయెల్ చెప్తోంది. వీటిలో సుమారు 450 మిసైల్స్‌ను, అలాగే మరో వెయ్యి డ్రోన్స్‌తో తమపై ఇరాన్ దాడులు చేసిందని ఆ దేశ అధికారులు అంటున్నారు. మిగతా మిసైల్స్ వేయడానికి అవసరమైన లాంచర్స్‌ను తాము టార్గెట్ చేశామని, ఇరాన్ వద్ద ఇంకో వంద బాలిస్టిక్ మిసైల్ లాంచర్స్ మాత్రమే పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ వర్గాల అంచనా.

ఇరాన్ ప్రతిదాడులు..

ఇజ్రాయెల్ తమపై దాడులు చేయడంతో ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. భారీగా మిసైల్స్, డ్రోన్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్‌’ను బ్రేక్ చేయడంలో ఇరాన్ విజయవంతమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ వేసిన పలు మిసైల్స్.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను తప్పించుకొని వెళ్లి విధ్వంసం సృష్టించాయి. యూఎస్‌లోని ఒక ఇరానియన్ మానవ హక్కుల సంఘం అంచనాల ప్రకారం, ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వందలాది మంది గాయాలపాలయ్యారు.

Next Story