Gauhati High Court: అసోంలో సిమెంట్ కంపెనీకి భూమి కేటాయింపుపై మండిపడ్డ గౌహతి హైకోర్టు

by S Gopi |

విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ మేధీ ఈ చర్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Gauhati High Court: అసోంలో సిమెంట్ కంపెనీకి భూమి కేటాయింపుపై మండిపడ్డ గౌహతి హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని దిమా హసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల గిరిజన భూమిని మైనింగ్ కార్యకలాపాల కోసం ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి కేటాయించాలన్న అసోం ప్రభుత్వ నిర్ణయంపై గౌహతి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం ఓ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో భూమి కేటాయింపు ఎందుకు చేసిందని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ మేధీ ఈ చర్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 3,000 బీఘాలు అంటే మొత్తం జిల్లానా? ఏం జరుగుతోంది? ఒక ప్రైవేట్ కంపెనీకి (మహాబల్ సిమెంట్స్) 3,000 బీఘాలు ఇస్తున్నారా? ఆ ప్రాంతంలో ఎంత బంజరు భూమి ఉందో మాకు తెలుసు, మరీ 3,000 బీఘాలా? అసలు ఇది ఎలాంటి నిర్ణయం? ఇదేమైనా జోకా? ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనం కాదు.. ప్రైవేటు ప్రయోజన నిర్ణయమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేటాయించినది బంజరు భూమి అని, సిమెంట్ ప్లాంట్‌ నిర్వహణకు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని సమర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఇదివరకు అసోం పార్టీ యూనిట్ చీఫ్ ప్రెసిడెంట్ భూపేన్ కుమార్ బోరా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి బోరోలోఖిండోంగ్, థర్వెలాంగ్సో, సమీప గ్రామాలకు చెందిన స్థానిక ప్రజల ఫిర్యాదులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల మనోభావాలు, హక్కులను విస్మరించి, అధికార బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న కార్పొరేట్ గ్రూపునకు దిమా హసావోలోని దాదాపు 9,000 బీఘాలను అప్పగించాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది కేవలం భూమి సమస్య కాదు, దిమా హసావో స్థానిక ప్రజల మనుగడ, గుర్తింపును కాపాడటం గురించి అని కాంగ్రెస్ పేర్కొంది.

Next Story