ఆ సినిమా ఎఫెక్ట్.. ఇక స్కూల్లో బ్యాక్ బెంచర్లు ఉండరు.. ఎందుకంటే?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో వింత ఘటన వెలుగు చూసింది.

ఆ సినిమా ఎఫెక్ట్.. ఇక స్కూల్లో బ్యాక్ బెంచర్లు ఉండరు.. ఎందుకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వింత ఘటన వెలుగు చూసింది. పాఠశాల విద్యా వ్యవస్థలో అందరూ గమనించే ఉంటారు.. ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్న విద్యార్థులే బాగా చదువుతారని అంటుంటారు. ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ చురుకైనవారని, లాస్ట్ బెంచ్ వారు అల్లరివారని భావిస్తారు కొందరు. టీచర్లు చెప్పే పాఠాలు సరిగ్గా వినరని.. వెనుక కూర్చొని టైం పాస్ చేస్తారని అనే భావన ఉంది. అంతేకాదు.. వారికి చదువురాదనే ధోరణి కూడా ఉంది. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు అందుకు తగ్గట్టుగానే వెనకల కూర్చొని టీచర్లు చెప్పే దాన్ని వినరు.

ఉపాధ్యాయులు కూడా చివరి బెంచ్ విద్యార్థులపై సరిగా దృష్టి సారించలేరు. దీంతో వెనక బెంచీలో కూర్చునే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించిన కేరళలోని పాఠశాలలు వినూత్నంగా ఆలోచన చేశాయి. ఆ దోరణికి ‘U సీటింగ్’ మోడల్ తో చెక్ పెడుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. క్లాస్ రూం నలువైపులా బెంచీలు వేశారు. ఇక, టీచర్ విద్యార్థులు ముందు నిలబడి పాఠాలు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. ఈ మార్పును మలయాళ సినిమా ‘స్థనార్థి శ్రీకుట్టన్’ స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సినిమా ప్రభావంతో బ్యాక్‌బెంచర్లు ఉండొద్దని అర్ధ వృత్తాకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి. ఈ ‘U సీటింగ్’ అసమానతలు తొలగించి, అంతా సమానమనే ఆలోచన తీసుకొస్తుంది. ‘స్థనార్థి శ్రీకుట్టన్’ మూవీ 'సైనా ప్లే' అనే ఓటీటీలో గత నెల(జూన్)లో విడుదలైంది. ఈ చిన్న సినిమా సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. విడుదలైన తర్వాత కేరళలోని స్కూల్స్ బ్యాక్ బెంచ్ పద్దతికి గుడ్ బై చెప్పేశాయి. దీనిపై ఈ సినిమా దర్శకుడు వినేష్ విశ్వనాథ్ స్పందిస్తూ.. సినిమా చూశాక ఆరు పాఠశాలలు బ్యాక్ బెంచ్ విధానాన్ని తీసి వేశాయని తెలిపారు. ఈ క్రమంలో స్కూళ్లు రౌండ్ సీటింగ్ పద్దతికి మారడం పై ఆయన హర్షం వ్యక్తంచేశారు.

Next Story