- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. అగ్రనేత ప్రశాంత్ బోస్ (కిషన్ దా) కన్నుమూత
నిషేధిత సీపీఐ పార్టీ ‘థింక్ ట్యాంక్’, పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత ప్రశాంత్ బోస్ (కిషన్ దా) ఇవాళ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో అత్యంత కీలక నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా (Kishan Da) కన్నుమూశారు. రాంచీ (Ranchi)లోని సెరైకెలా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీనితో జైలు అధికారులు ఉదయం 6 గంటల సమయంలో భారీ భద్రత నడుమ ఆయనను రాంచీలోని రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
రూ. కోటి రివార్డు.. సంచలన అరెస్ట్
సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన ‘నంబర్-2’ నేతగా కిషన్ దాకు గుర్తింపు ఉంది. పార్టీ సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీకి 'థింక్ ట్యాంక్'గా వ్యవహరించారు. ఈస్టర్న్ రీజినల్ బ్యూరో (ERB) సెక్రటరీగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సహచరులు ఆయనను ‘మనీష్’, ‘బుద్ధ’ అని కూడా పిలుస్తుంటారు.
ప్రశాంత్ బోస్ తలపై జార్ఖండ్ ప్రభుత్వం రూ. 1 కోటి రివార్డును ప్రకటించింది. దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన ఆయనను, 2021 నవంబర్‌లో జార్ఖండ్ పోలీసులు ఒక భారీ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు భార్య, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు శీలా మరాండీ కూడా అప్పట్లో పట్టుబడ్డారు. నాటి నుండి ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
‘మాస్టర్ స్ట్రోక్’లో కిషన్ దా పాత్ర..
కాగా, సెప్టెంబర్ 2004లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ విలీనమై సీపీఐ (మావోయిస్ట్) పార్టీగా ఏర్పడ్డాయి. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిషన్ జీ, సీపీఐ (ఎంఎల్ పీపుల్స్ వార్) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి మధ్య కిషన్ దా సమక్షంలోనే ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఆ విలీనాన్ని సీనియర్ పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు అద్భుతమైన ‘మాస్టర్ స్ట్రోక్’ అభివర్ణించారు. ఎందుకంటే, ఆ గ్రూపు ఆయుధాలు, మానవ వనరుల పరంగానే కాకుండా, తన ఆజ్ఞాపాలన ప్రాంతం విస్తరణ పరంగా కూడా విస్తరించింది. అది ఆగ్నేయాసియా ప్రాంతంలో రాత్రికి రాత్రే అతిపెద్ద సాయుధ పార్టీగా సీపీఐ మావోయిస్టు పార్టీ అవతరించింది. ఈ విలీనంతో కిషన్ దా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుకొని ఉన్న మధ్య భారతదేశంలో వామపక్షజాలాన్ని మరింత బలపరిచారు.
ముగిసిన ఒక శకం
కిషన్ దా మృతి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటు అని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నేత కావడంతో పాటు, వ్యూహరచనలో ఆయనది అందెవేసిన చేయి. గత కొన్నేళ్లుగా అగ్రనేతల అరెస్టులు, మరణాలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ప్రశాంత్ బోస్ మరణం కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






