చమురు నౌకలకు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్

by Gantepaka Srikanth |

గతకొన్ని వారాలుగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మూతపడిన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

చమురు నౌకలకు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని వారాలుగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మూతపడిన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి ద్వారా అన్ని వాణిజ్య నౌకల ప్రయాణానికి మార్గం పూర్తిగా తెరిచి ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందన్న వార్తలను విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు. వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేవని, ప్రస్తుతం ఈ మార్గం పూర్తిగా అందుబాటులో ఉందని ఆయన ప్రకటించారు. జలసంధి తెరిచే ఉన్నప్పటికీ, భీమా సంస్థలు (Insurers) యుద్ధ ముప్పు దృష్ట్యా నౌకల ప్రయాణానికి వెనుకాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ఇరాన్ కారణం కాదని, అమెరికా-ఇజ్రాయెల్ చర్యల వల్లే ఈ అనిశ్చితి నెలకొందని విమర్శించారు.

ఒమన్ వైపు నుంచి ప్రయాణం..

తాజా ప్రతిపాదనల ప్రకారం, ఇరాన్ ప్రాంతం కాకుండా ఒమన్ (Oman) ప్రాదేశిక జలాల వైపు నుంచి నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరటనిచ్చే పరిణామం. గతంలోనే భారత్, చైనా, రష్యా వంటి స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను అనుమతిస్తామని ప్రకటించిన ఇరాన్, ఇప్పుడు సాధారణ వాణిజ్య నౌకలకు కూడా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు మరియు సహజ వాయువులో (LNG) సుమారు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ తాజా ప్రకటనతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story