Iran: ఇరాన్, ఇజ్రాయెల్‌లపై ట్రంప్ ఆగ్రహం.. కారణమిదే?

by B.Srinivas |

పశ్చిమాసియాలో భీకరంగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడింది. ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి.

Iran: ఇరాన్, ఇజ్రాయెల్‌లపై ట్రంప్ ఆగ్రహం.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో భీకరంగా కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి సీజ్ ఫైర్ జరిగినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య 24 గంటల్లోగా దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో మంగళవారం ఉదయం వెల్లడించారు. ఆరు గంటల్లో సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కాల్పుల విరమణకు సహకరించిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇకపై రెండు దేశాలు శాంతి యుతంగా, గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘రెండు దేశాల మధ్య కొనసాగిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మధ్య ప్రాచ్యం నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు, ఎప్పటికీ జరగబోదు, దేవుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, పశ్చిమాసియా, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు’ అని ట్రంప్ తెలిపారు. దీంతో 12 రోజుల వార్‌కు ముగింపు పలికినట్టు అయింది.

కొన్ని గంటల్లోనే విఫలం

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన స్వల్ప సమయంలోనే ఇరాన్ ఇజ్రాయెల్‌లు ఆ ప్రతిపాదనను ఉల్లంఘించాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఒక క్షిపణి బీర్షెబా నగరంలోని ఒక భవనాన్ని ఢీకొట్టగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా టెహ్రాన్ పై దాడి చేయాలని ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని ఆదేశించింది. దీంతో టెహ్రాన్‌లోని రాడార్ సైట్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులు చేసింది. అంతేగాక అనేక ప్రదేశాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ తన గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ సైన్యం దీనిని ఖండించింది. కానీ ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలుళ్లు వినిపించినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి.

ట్రంప్ జోక్యంతో దిగొచ్చిన ఇరు దేశాలు

కాల్పుల విరమణ అనంతరం కూడా ఇరు దేశాలు దానిని ఉల్లంఘించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హేగ్‌లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. ఇజ్రాయెల్ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దాడులను ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించారు. ఫైటర్ జెట్లను వెనక్కి తీసుకోవాలని కోరారు. టెహ్రాన్ పై దాడులు చేయొద్దని అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘన అవుతుందని హెచ్చరించారు. ఈ విషయంపై నెతన్యాహుతోనూ ఫోన్ చేసి మాట్లాడినట్టు వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ట్రంప్ ఫోన్ సంభాషణ తర్వాత ఇరాన్ పై ఎటువంటి దాడులు చేయలేదని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అనంతరం ట్రంప్ మరోసారి ప్రకటన చేశారు. కాల్పుల విరమణ అమలులోనే ఉందని ఇక ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ విమానాలన్నీ వెనక్కి వస్తాయని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ గౌరవిస్తే మేమూ గౌరవిస్తాం: పెజిష్కియాన్

ట్రంప్ ప్రకటనం అనంతరం తాము దాడులు చేయడం లేదని ఇరాన్ సైతం వెల్లడించింది. అయితే ట్రంప్ ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరోసారి టెహ్రాన్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్పందించారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను గౌరవిస్తే తాము కూడా గౌరవిస్తామన్నారు. ఇజ్రాయెల్ తన నిబంధనలను పాటిస్తే ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణను తాము గౌరవిస్తామని తెలిపారు.

స్వాగతించిన భారత్

ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ ఓ ప్రకటన విడుదల చేసింది. స్థిరమైన ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం మేము తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ తీసుకురావడంలో కృషి చేసిన అమెరికా, ఖతార్ లను ప్రశంసించింది. సంభాషణ, దౌత్యం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని, శాశ్వత శాంతి కోసం ఇరు పక్షాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలలో తమ వంతు పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది.

Next Story