Iran: ఇరాన్‌లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు సేఫ్.. వెల్లడించిన ఎంబసీ

by B.Srinivas |

ఇటీవల ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన వెంటనే ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

Iran: ఇరాన్‌లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు సేఫ్.. వెల్లడించిన ఎంబసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఇండియా నుంచి ఇరాన్ (Iran) వెళ్లిన వెంటనే ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే దుండగుల చెర నుంచి వారిని రక్షించినట్టు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. ప్రస్తుతం ఇండియన్స్ ముగ్గురూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత కాన్సులర్ విభాగం పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొంది. టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని తెలిపింది. త్వరలోనే స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని, ఇతర దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని సూచించింది. దీనిని భారత్ సైతం ధ్రువీకరించింది. తమ పౌరులను సేఫ్ చేసిన ఇరాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య నిజమైన స్నేహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రశంసించింది.

కాగా, పంజాబ్‌ (Panjab)కు చెందిన ముగ్గురు యువకులు హుషన్ ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్ పాల్ సింగ్‌లు దుబాయ్ ఇరాన్ మార్గంలో ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో దిగిన వెంటనే వారు అదృశ్యమయ్యారు. పలువురు దుండగులు వారి కుటుంబాలకు ఫోన్ చేసి బెదిరించడంతో వారు భారత్ ఎంబసీకి ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇరాన్ ప్రభుత్వానికి తెలియజేయడంతో గాలింపు చర్యలు చేపట్టి సురక్షితంగా రక్షించారు.

Next Story