Iran: ఇరాన్ గగనతలంపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఆరు ఎయిర్‌పోర్టులపై దాడులు

by B.Srinivas |

ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది.

Iran: ఇరాన్ గగనతలంపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఆరు ఎయిర్‌పోర్టులపై దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడులకు పాల్పడ్డ మరుసటి రోజే ఇరాన్ ఎయిర్ పోర్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్ గగనతలాన్ని టార్గెట్ చేస్తూ ఆరు విమానాశ్రయాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 సైనిక విమానాలు ధ్వంసమైనట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. పశ్చిమ, తూర్పు, మధ్య ఇరాన్‌లోని మూడు విమానాశ్రయాలతో పాటు టెహ్రాన్, మషద్, డెజ్‌ఫుల్‌లోని ఎయిర్ పోర్టులపై అటాక్ చేసినట్టు పేర్కొంది. ఈ దాడుల్లో రన్‌వేలు, భూగర్భ బంకర్లు, ఇంధన విమానాలు, ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 హెలికాప్టర్లు, జెట్‌లు దెబ్బతిన్నాయి. ఇరానియన్ వైమానిక దళ కార్యాచరణ సామర్థ్యాలను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. ఈ దాడుల వల్ల ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు టేకాఫ్ అయ్యే సామర్థ్యం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

దీటుగా బదులిచ్చిన ఇరాన్

ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం దీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు తెగపడింది. దాదాపు 40 నిమిషాల పాటు చేసిన దాడులతో ఇజ్రాయెల్ లోని విద్యుత్ కేంద్రాలు చాలా మేరకు దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ 15 బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడిందని ఈ దాడుల్లో కీలకమైన విద్యుత్ ప్లాంట్లు దెబ్బతిన్నట్టుప్రకటించింది. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దెబ్బతిన్న విద్యుత్ కేంద్రాల నుంచి కరెంట్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయిల్ ఎలక్రికల్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.

ఫోర్డో అణు కేంద్రంపై మళ్లీ దాడి

ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. అంతకుముందు అమెరికా దాడి చేసిన ప్రదేశంలోనే ఈ దాడి జరిగిందని స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ దాడి వల్ల స్థానిక నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపాయి. అలాగే టెహ్రాన్‌లో ఉన్న అంతర్గత భద్రతా దళాలు, ఐఆర్‌జీసీ కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపై తమ వైమానిక దళ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

రష్యా సాయం కోరిన ఇరాన్ !

ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇచ్చిన తర్వాత ఇరా రష్యా నుంచి సాయం ఆశిస్తోంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో భేటీ అయ్యారు. తమకు మద్దతివ్వాలని కోరుతూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రాసిన లేఖను అందజేశారు. అయితే ఇరాన్ రష్యా నుండి ఎలాంటి సహాయం కోరుకుంటుందో స్పష్టం చేయలేదు. ఈ సందర్భంగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను పుతిన్ తీవ్రంగా ఖండించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభం మధ్య ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రష్యా చురుకుగా పనిచేస్తోందని నొక్కి చెప్పారు. యూఎస్ దాడులు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు.

దాడులు చివరి దశకు చేరుకున్నాయి: నెతన్యాహు

రెండు దేశాలు పరస్పరం మిస్సైళ్ల దాడులు చేసుకుంటున్న వేళ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్‌తో తాము ఇక యుద్ధం చేయబోమన్నారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్ ’ దాడులు చివరి దశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలను నేలమట్టం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే పోర్డ్, నతాంజ్ అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేసిన తర్వాత నెతన్యాహు యుద్ధం చేయడం లేదని పేర్కొనడం గమనార్హం.

మీరు ప్రారంభించారు మేము అంతం చేస్తాం: ఇరాన్

ఇరాన్ అణు కేంద్రాలపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునకు ఇరాన్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘారి మాట్లాడుతూ.. మీరు యుద్ధాన్ని ప్రారంభించారు కానీ మేము దానిని అంతం చేస్తాం అని హెచ్చరించారు. మరోవైపు కీలకమైన అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇరాన్ సాయుధ దళాల సైనిక అధిపతి అబ్దుల్‌రహీం మౌసావి ప్రతిజ్ఞ చేశారు.

Next Story