- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iran: ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు.. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ
ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయెల్ (Iran Israel) వివాదం వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayathullah khameni) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని, ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం టెలివిజన్‌లో ఆవేశ పూరిత ప్రసంగం చేశారు. తమ దేశంపై సైనిక చర్య తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడి తీవ్రమైన తప్పు చేసిందని, దీనికి ఖచ్చితంగా ఆ దేశం శిక్ష అనుభవిస్తుందని స్పష్టం చేశారు. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నొక్కి చెప్పారు. ఆ దేశ పాలకులపై ఎటువంటి దయ చూపబోమని తెలిపారు. అమెరికా తీరుపైనా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా అటాక్ చేస్తూ తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రస్తుత సైనిక వివాదంలో యూఎస్ పాల్గొనొద్దని, అలాంటి చర్య అమెరికా ప్రయోజనాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందన్నారు.
తగిన సమాధానం ఇస్తాం
ఇరాన్ తన భూభాగంపై జరిగే ఏదైనా దురాక్రమణకు కఠినంగా స్పందిస్తుందని ఖమేనీ ప్రకటించారు. ఆ దేశ సాయుధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ దాడులను క్షమించబోమని ప్రతిజ్ఞ చేశారు. తమ భద్రతా బలగాలు మాతృభూమిని రక్షించడానికి ఎంతకైనా తెగిస్తాయని దీమా వ్యక్తం చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఖమేనీ పై వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు ఖమేనీ యుద్ధం ప్రారంభమైందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇరాన్ అంతర్గత భద్రతా ప్రధాన కార్యాలయం ధ్వంసం
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వరుసగా ఆరో రోజూ కొనసాగింది. ఇరు దేశాలు క్షిపణులతో దాడులు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామునే ఇరాన్ దాడులకు పాల్పడటంతో ఇజ్రాయెల్ లో సైరన్లు మోగినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ అంతర్జాతీయ భద్రతా కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తమ వైమాణిక దళ యుద్ధ విమానాలు ఈ దాడి చేశాయని వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలపై దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్‌లోని కెర్మాన్‌షాలోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరానియన్ ఏహెచ్-1 హెలికాప్టర్‌లను ధ్వంసం చేసింది.
నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు: ట్రంప్
ఇరాన్ అమెరికాతో చర్చలు జరపాలనుకుంటోందని, కానీ ఆ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం అయిందని తెలిపారు. వారం క్రితం నాటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందన్నారు. తాను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదని చెప్పారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ఎంతకాలం కొనసాగుతుందో తనకు ఖచ్చితంగా తెలియదన్నారు. ఇరాన్ అణు ఉద్దేశాలపై తనకు నమ్మకం లేదని, ఆ దేశం అణు కార్యక్రమం దుష్పరిణామాలను కలిగి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే తమకు ఓపిక నశించిందని నొక్కి చెప్పారు.






