Iran: ఇరాన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర.. బయటపడ్డ సంచలన నివేదిక

by B.Srinivas |

గత నెలలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు అంగీకరించడంతో దాడులు ఆగిపోయాయి.

Iran: ఇరాన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర.. బయటపడ్డ సంచలన నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నెలలో ఇజ్రాయెల్, ఇరాన్ (Israel iran) మధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో దాడులు ఆగిపోయాయి. అయితే తాజాగా ఓ సంచలన నివేదిక బయటకొచ్చింది. యుద్ధంలో భాగంగా జూన్ 16న ఇజ్రాయెల్ చేసిన వైమాణిక దాడిలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ( Masoud Pezeshkian) గాయపడ్డారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదిక తెలిపింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్న టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణి దాడి జరిగినట్టు పేర్కొంది. భవనంపై దాదాపు ఆరు మిస్సైల్స్ ప్రయోగించగా ఈ ఘటనలో పెజిష్కియాన్‌కు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది.

బీరుట్‌లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాపై జరిగిన హత్యాయత్నం తరహాలో ఈ దాడి జరిగిందని, భవనానికి ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశారని తెలిపింది. దాడి టైంలో పెజిష్కియాన్‌తో పాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘర్ గాలిబాఫ్, న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలం-హోస్సేన్ మొహ్సేని ఎజెయ్, అనేక మంది సీనియర్ అధికారులు కూడా అందులో ఉన్నారు. అయితే వారంతా భవనం కింది అంతస్థులో ఉన్నారని, అందుకే వారిపై దాడి ప్రభావం చూపలేదు. పేలుళ్ల శబ్దం తర్వాత ప్రతినిధులందరూ అత్యవసర ద్వారం గుండా తప్పించుకున్నారని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే పెజిష్కియాన్ సహా పలువురికి గాయాలయ్యాయని పేర్కొంది. నస్రల్లా తరహాలోనే పెజిష్కియాన్ లక్ష్యంగా దాడి జరిగిందని ఇరాన్ ఆరోపించింది. కాగా, ఇజ్రాయెల్ తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని అధ్యక్షుడు పెజిష్కియన్ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజా నివేదిక హాట్ టాపిక్‌గా మారింది.

Next Story