Interpol: నేరస్థులపై భారత్ నజర్.. భారీగా పెరిగిన రెడ్ నోటీసుల సంఖ్య

by B.Srinivas |

భారత ప్రభుత్వం తీసుకుంటున్న కీలక వ్యూహాలు ఇంటర్‌పోల్‌ రెడ్ నోటీసుల ప్రక్రియలో ఫలితాలు తీసుకొస్తున్నది.

Interpol: నేరస్థులపై భారత్ నజర్.. భారీగా పెరిగిన రెడ్ నోటీసుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రభుత్వం తీసుకుంటున్న కీలక వ్యూహాలు ఇంటర్‌పోల్‌ రెడ్ నోటీసుల ప్రక్రియలో ఫలితాలు తీసుకొస్తున్నది. విదేశాలకు పారిపోయిన నేరస్థులను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ జారీ చేసే రెడ్ కార్నర్ నోటీసుల సంఖ్య భారీగా పెరిగింది. సీబీఐ ఆధ్వర్యంలో ఇంటర్‌పోల్‌కు పంపిన రెడ్ నోటీసుల సంఖ్య 2023 నుంచి రెట్టింపు అయింది. 2020లో 25, 2021లో 47, 2022లో 40 రెడ్ నోటీసులు మాత్రమే జారీ కాగా, 2023లో అవి 100కు చేరాయి. అలాగే 2024లో 107, 2025 తొలి ఆరు నెలల్లోనే 56 నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేసే విషయంలో భారత్ కీలకంగా చొరవ తీసుకుంటుందని, గతంలో కంటే మరింత కఠినమైన పద్ధతిలో నేరస్థుల అన్వేషణలో నిమగ్నమై ఉందని పలువురు భావిస్తున్నారు.

దౌత్య విషయాలే కీలకం

2022లో భారత్‌ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీని విజయవంతంగా నిర్వహించగా, 2023లో జరిగిన జీ20 సదస్సుతో అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరిగింది. ఈ క్రమంలోనే నోటీసుల సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. అంతేగాక దౌత్యం, బలమైన సంస్థాగత చర్య, సాంకేతిక పద్దతులు కూడా కారణమవుతున్నాయి. జీ20 శిఖరాగ్ర సమావేశం భారతదేశ అంతర్జాతీయ స్థాయిని గణనీయంగా పెంచింది. ప్రధానంగా 20 ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ప్రాంతాల ఆర్థిక సమావేశం అయినప్పటికీ, ఈ కార్యక్రమం కీలకమైన భద్రతా సహకారాలను కూడా పెంపొందించింది. ఇది దేశాల మధ్య మెరుగైన చట్టపరమైన సహకారానికి దారి తీయడంతో పాటు పారిపోయిన ఖైదీల అప్పగింతపై ఏకాభిప్రాయానికి దారి తీసింది.

‘భారత్ పోల్’ ఎఫెక్ట్

సీబీఐ ఇటీవల భారత్‌పోల్ అనే డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది రెడ్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసింది. దీనివల్ల గతంలో నోటీసు జారీ చేయడానికి సగటున ఆరు నెలలు పట్టేది. కానీ ఇప్పుడు అది మూడు నెలల్లోనే పూర్తవుతుంది. నేరస్థుల ప్రొఫైల్ గుర్తింపు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా విశ్లేషణల ద్వారా మరింత ఖచ్చితమైనదిగా మారుతోంది. ఈ క్రమంలోనే నోటీసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. 2025 లో 23 మంది పారిపోయిన నేరస్థులను తిరిగి తీసుకువచ్చారు. 2010 నుంచి 2019 వరకు 74 మందిని మాత్రమే దేశానికి తిరిగి తీసుకొచ్చారు.

రెడ్ నోటీసు అంటే?

రెడ్ నోటీసు అనేది ఇంటర్‌పోల్ జారీ చేసే ఒక ప్రత్యేక హెచ్చరిక. ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని జారీ చేయొచ్చు. దేశం నుంచి పారిపోయిన ఒక వ్యక్తిని పట్టుకుని ఆయనను తాత్కాలికంగా అరెస్ట్ చేయమని చేసే విజ్ఞప్తి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు పారిపోయిన వ్యక్తిని పట్టుకోవాలనుకున్నప్పుడు వారు సీబీఐకి ఫిర్యాదు చేస్తారు. దీంతో సీబీఐ రెడ్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్ పోల్ కు చెబుతుంది.

Next Story