INSV Kaundinya: ప్రాచీన భారత వైభవం ఆవిష్కృతం.. సురక్షితంగా గమ్యం చేరిన ‘కౌండిన్య’

by Prasad Jukanti |

సముద్రయాణంలో భారత దేశం మరో సారి తన సత్తా చాటింది.

INSV Kaundinya: ప్రాచీన భారత వైభవం ఆవిష్కృతం.. సురక్షితంగా గమ్యం చేరిన ‘కౌండిన్య’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సముద్రయాణంలో ప్రాచీన భారత శక్తి మరో కళ్లముందు ఆవిష్కృతమైంది. ఇండియన్ నేవీ (Indian Navy) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సాంప్రదాయ కుట్టు నౌక INSV కౌండిన్య (INSV Kaundinya) తన చారిత్రాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎన్నో చారిత్రాత్మక ప్రత్యేకతలు కలిగిన ఈ ఓడ గత నెల 29న గజరాత్ లోని పోర్ బందర్ పోర్టు నుంచి 18 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ ఓడ సురక్షితంగా గమ్యం చేరుకుంది. మొత్తం 18 రోజుల పాటు 750 నాటికల్ మైల్స్ (1400 కిలోమీటర్లు) సురక్షితంగా ప్రయాణించి బుధవారం నాడు ఒమన్‌లోని మస్కట్ (Muscat Oman) చేరుకుంది. ఎలాంటి ఇంజన్ లేకుండా కేవలం తెరల సహాయంతో కొనసాగిన ఈ ప్రయాణం భారతదేశ ప్రాచీన సముద్రయాణ వైభవానికి, అద్వితీయమైన నౌకా నిర్మాణ కౌశల్యానికి ప్రతీకగా నిలిచింది.

అణువణువు చారిత్రాత్మకమే :

ఈ ఐఎన్ఎస్‍వి కౌండిన్య ఓడ నిర్మాణం నుంచి ప్రయాణం వరకు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. అజంతా గుహల్లో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో తీర్చిదిద్దిన ఓడ చిత్రం ఆధారంగా కేరళకు చెందిన కార్మికులు చెక్క పలకలతో కౌండిన్య ఓడను తయారు చేశారు. నౌక పొడవు 65 అడుగులు, వెడల్పు 22 అడుగులు, ఎత్తు 13 అడుగులతో రూపొందించారు. దీని తయారీలో ఎక్కడా మేకులు వాడలేదు. చెక్కలను జతచేసేందుకు కొబ్బరి తాడు, కొబ్బరి పీచు, సహజమైన రెసిన్ ఉపయోగించి చెక్కలను కుట్టినట్టుగా 'స్టిచ్‍డ్ షిప్' మోడల్‍తో రూపొందించారు.

దిగ్గజ నావికుడి పేరు:

ఈ ఓడకు పూర్వ కాలంలో మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఓడలను నడిపిన దిగ్గజ నావికుడు కౌండిన్య పేరును ఈ ఓడకు పెట్టారు. నౌక తరచాలపై గండభేరుండ పక్షి, సూర్యుడి రూపాలను చిత్రించారు. ముందు భాగంలో సింహాయాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతి రూపంలో ఉండే లంగరు బొమ్మను డెక్ పై ఉంచారు.

Next Story