లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఆరుగురు స్పాట్ డెడ్!

by Naga Rani Yarlagadda |

పర్యాటకులతో వెళ్తున్న ఇన్నోవా.. భారీ వర్షానికి రోడ్డుపైనుంచి జారి లోయలోకి దూసుకెళ్లింది.

లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఆరుగురు స్పాట్ డెడ్!
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండగా.. పర్యాటకులతో వెళ్తున్న ఇన్నోవా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, భీకరమైన గాలుల కారణంగా రహదారులు ప్రమాదకరంగా మారాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో, 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం చంబా జిల్లాలోని లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిని గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన లలిత్‌భాయ్ పత్నాని, మమతాబెన్, ప్రియాంక్ భోపాని, కాజల్, చిన్నారి దియాన్ష్‌(3)తో పాటు మండి జిల్లాకు చెందిన డ్రైవర్ జస్వంత్ కుమార్‌(51)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మయాంక్ పత్నాని(31), ఫోరమ్ బెన్ పత్నాని (31), ఇద్దరు చిన్న పిల్లలు జియాన్ష్, ప్రియాన్షిల పరిస్థితి విషమంగా ఉంది. వీరికి తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం ముగ్గురు క్షతగాత్రులను టాండా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story