IndiGo: విమానంలో టర్బ్ లెన్స్.. సాయం కోరిన ఇండిగో.. తిరస్కరించిన పాక్

by Shamantha N |

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం తుఫాన్ కారణంగా గగనతలంలోనే తీవ్ర కుదుపులకు లోనైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

IndiGo: విమానంలో టర్బ్ లెన్స్.. సాయం కోరిన ఇండిగో.. తిరస్కరించిన పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం తుఫాన్ కారణంగా గగనతలంలోనే తీవ్ర కుదుపులకు లోనైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అయితే, వర్షం సృష్టించిన బీభత్సం వల్ల ఇండిగో ఫ్లైట్ లో టర్బులెన్స్ ఏర్పడింది. ఆ సమయంలో టీఎంసీ ఎంపీలు సహా 220 మందికిపైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానం 6ఈ2142 గగనతలంలో వడగళ్ల వానలో చిక్కుకుపోయింది. అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. విమానం ముందు భాగం దెబ్బతిన్నది. అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC)కి సంకేతాలు పంపించారు. ఇక ఈ టర్బులెన్స్ ని తప్పించుకునేందుకు పాక్‌ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారు. అందుకోసం, పైలట్ లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతి కోరాడు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్‌ ఏటీసీ (Lahore ATC) తిరస్కరించినట్లు (Pak Rejected IndiGo Pilots Request) సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. పరిమిత ఎంపికలు మిగిలి ఉండటంతో పైలట్ మొదట ఢిల్లీకి తిరిగి రావాలని భావించాడని డీజీసీఏ ప్రకటించింది. అయితే, తుఫాన్ వల్ల విమానం శ్రీనగర్ వెళ్లడం అసురక్షిత ఎంపిగా మారిందంది. పాక్ తిరస్కరణ తర్వాత పైలట్ తుఫాను గుండా శ్రీనగర్ వైపు సాధ్యమైనంత తక్కువ మార్గంలో ముందుకు సాగాలని పైలట్ నిర్ణయించుకున్నాడని వెల్లడించింది. కాగా, పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో గతనెల భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకు పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది.

Next Story