భారత సైన్యం అమ్ములపొదిలోకి 'స్వదేశీ' ఫైర్ ఫైటింగ్ రోబోలు.. iDEX కింద కీలక ఒప్పందం

by Ramesh Naini |

‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధన దిశగా భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది.

భారత సైన్యం అమ్ములపొదిలోకి స్వదేశీ ఫైర్ ఫైటింగ్ రోబోలు.. iDEX కింద కీలక ఒప్పందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధన దిశగా భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది. రక్షణ రంగంలో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే ‘ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్’ (iDEX) పథకం కింద అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ రోబోల (Fire Fighting Robots) కొనుగోలుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. జనవరి 13, 2026న భారత సైన్యానికి చెందిన క్యాపబిలిటీ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఈ ఒప్పంద ప్రక్రియ జరిగింది. ఫైర్ ఫైటింగ్ రోబోల సరఫరా కోసం మెస్సర్స్ ‘స్వదేశీ ఎంప్రెసా ప్రైవేట్ లిమిటెడ్’ (Swadeshi Empresa Pvt Ltd) సంస్థతో ఆర్మీ అధికారులు సంతకాలు చేశారు.

త్రివిధ దళాల ఏకీకరణకు నిదర్శనం..

ఈ రోబోలను వాస్తవానికి భారత నౌకాదళం (Indian Navy) కోసం ఐడెక్స్ (iDEX) ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేశారు. నౌకాదళం నిర్వహించిన సింగిల్ స్టేజ్ కాంపోజిట్ ట్రయల్ (SSCT) విజయవంతం కావడంతో, ఆ నిబంధనలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్మీ వీటిని కొనుగోలు చేస్తోంది. ఒక సోదర విభాగం కోసం అభివృద్ధి చేసిన ఐడెక్స్ ఉత్పత్తులను భారత సైన్యం కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఇది రక్షణ రంగంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడమే కాకుండా, త్రివిధ దళాల మధ్య సాంకేతిక ఏకీకరణను (Jointness) సూచిస్తుంది.

రోబో ప్రత్యేకతలు ఇవే..

ఈ ఫైర్ ఫైటింగ్ రోబో ఒక కాంపాక్ట్ 'అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్' (Unmanned Ground Vehicle). ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, మనుషులు వెళ్లలేని చోట ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. సురక్షిత ప్రాంతం నుంచే మంటలను అదుపు చేయడానికి వీలు కల్పిస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో ఆర్మీ సిబ్బంది ప్రాణాలకు రక్షణగా నిలుస్తుంది. రక్షణ రంగంలో స్టార్టప్‌లను, ఆవిష్కర్తలను సైన్యంతో అనుసంధానించడంలో iDEX కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారత సైన్యం iDEX ద్వారా ఇప్పటికే డెలివరీ అయిన ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూనే, మరో 22 ప్రాజెక్టులను ట్రయల్స్ దశకు తీసుకువెళ్తుంది.

Next Story