దేశంలోనే తొలి 'వందే భారత్ స్లీపర్' ప్రారంభం.. ప్రధాని మోడీ పచ్చజెండా

by Ramesh Naini |   (  Updated:2026-01-17 08:36:16  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (జనవరి 17) దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఈ రైలును పట్టాలెక్కించారు.

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ప్రారంభం.. ప్రధాని మోడీ పచ్చజెండా
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత రైల్వే రంగంలో మరో సరికొత్త శకం మొదలైంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా - అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు మాల్దా టౌన్ నుంచి కామాఖ్య వరకు ఈ రైలు తన తొలి ప్రయాణాన్ని చేపట్టింది.

తగ్గనున్న ప్రయాణ సమయం..

ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి రావడం వల్ల హౌరా- గువాహటి మధ్య ప్రయాణ సమయం దాదాపు 6 గంటలు తగ్గనుంది. ఆరెంజ్, గ్రే రంగుల్లో మెరిసిపోతున్న ఈ రైలును BEML సంస్థ ICF సాంకేతికతతో రూపొందించింది. ఇందులో ప్రయాణీకులకు విలాసవంతమైన బర్త్‌లతో పాటు ప్రాంతీయ వంటకాలతో కూడిన మెరుగైన క్యాటరింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ..

ప్రారంభ రోజైన నేడు కామాఖ్య-హౌరా స్పెషల్ (02076) రంగియా, న్యూ జల్పాయ్‌గురి, మాల్దా టౌన్, కత్వా వంటి 13 ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. మాల్దా-కామాఖ్య స్పెషల్ (02075) ఏడు స్టేషన్లలో నిలుస్తుంది. ఈ రైలు కేవలం రవాణా వ్యవస్థనే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ మధ్య కనెక్టివిటీని పెంచి, పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

Read More..

పుణ్యం వస్తుందనే ఆ కులాల స్త్రీలపై అత్యాచారాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Next Story