గర్భాశయ క్యాన్సర్‌పై భారత్ పోరు.. దేశవ్యాప్తంగా ఉచిత ‘HPV' వ్యాక్సినేషన్ ప్రారంభం

by Kema Shiva Kumar |

14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్త ఉచిత HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఇవాళ అజ్మీర్‌లో ప్రారంభించనున్నారు.

గర్భాశయ క్యాన్సర్‌పై భారత్ పోరు.. దేశవ్యాప్తంగా ఉచిత ‘HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని మహిళల ఆరోగ్య సంరక్షణలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా, 14 ఏళ్ల లోపు బాలికల కోసం రూపొందించిన దేశవ్యాప్త HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రారంభించనున్నారు. ‘స్వస్థ నారి’ (Swastha Nari) పేరుతో మహిళా ఆరోగ్య రంగంలో సమానత్వం, రక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర వెల్లడించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈ టీకాను ఉచితంగా అందిస్తారు. ఈ వ్యాక్సినేషన్‌ను పూర్తిగా ఐచ్ఛికం చేశారు. టీకా ఇచ్చే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి ఖచ్చితంగా అనుమతి (Informed Consent) తీసుకోనున్నారు. టీకాల కార్యక్రమం మొదటి 3 నెలల పాటు ‘మిషన్ మోడ్’లో కొనసాగనుంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా జరిగే సాధారణ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో భాగంగా అందుబాటులో ఉండనుంది.

కాగా, భారత్‌లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. GLOBOCAN-2022 డేటా ప్రకారం, దేశంలో ఏటా 1.20 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, సుమారు 80 వేల మంది మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దీర్ఘకాలికంగా శరీరంలో ఉండటం వల్ల వస్తుంది. ఇందులో భాగంగా ‘గార్డసిల్’ (Gardasil) అనే క్వాడ్రివాలెంట్ HPV వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తోంది. శాస్త్రీయంగా ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో దాదాపు 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది. కేంద్ర చేపడుతున్న ఈ కార్యక్రమంతో ఈ టీకాను అమలు చేస్తున్న 160కి పైగా దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది.

Next Story