- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
93% అప్రూవల్ రేటు ఉన్న యూఎస్ వీసా.. ఇప్పుడు దీనిపైనే ఇండియన్స్ ఫోకస్!
93 శాతం అప్రూవల్ రేటు ఉన్న యూఎస్ వీసాపై ఇండియన్స్ ఫోకస్ పెడుతున్నారు. హెచ్1బీపై ఆంక్షలు కఠినంగా మారడంతోనే ఇలా చేస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో పనిచేసేందుకు వర్క్ వీసాలు దక్కడం కష్టం అవుతున్న నేపథ్యంలో భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో వారి దృష్టిని ఓ-1 వీసాలు ఆకర్షిస్తున్నాయి. యూఎస్‌లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించే నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ఈ వీసా ఉపయోగపడుతుంది. ఇది ఒక స్పెషలైజ్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్, ఫిలిమ్, టెలివిజన్ రంగాల్లో ‘అసాధారణ ప్రతిభ’ ఉన్న వారికి ఈ వీసా అందిస్తారు. ఈ వీసా రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. అయితే మొత్తం 8 రూల్స్‌లో మూడింటిని సంతృప్తి పరిచినా వీసా దక్కే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వీసాకు లాటరీ సిస్టం లేదు.
సాధారణంగా యూఎస్‌లో ఉద్యోగం చేసే వారు హెచ్1బీ వీసాల కోసం ప్రయత్నిస్తారు. వీటికి లాటరీ సిస్టం ఉండటంతోపాటు కేవలం 37 శాతమే అప్రూవల్ రేటు ఉంది. అదే సమయంలో ఓ-1 వీసాల్లో 93 శాతం అప్రూవల్ రేటింగ్ ఉంది. అయితే హెచ్1బీతో పోలిస్తే ఇది చాలా ఖరీదైనదని చెప్పాలి. ఈ వీసా ధర 10 వేల నుంచి 30 వేల డాలర్ల వరకూ ఉంటుంది. అంటే హెచ్1బీ కన్నా దాదాపు పదిరెట్లు ఎక్కువన్నమాట. కానీ 93 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్న ఈ వీసా కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టేందుకు చాలామంది నిపుణులు ఏమాత్రం ఆలోచించడం లేదు.
భారతీయుల కన్ను..
డాలర్ డ్రీమ్స్ ఉన్న ఎందరో భారతీయులు అమెరికా చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే 2020 నుంచే ఈ ఓ-1 వీసాలకు కూడా భారీగా దరఖాస్తులు చేస్తున్నట్లు సమాచారం. 2020లో ఈ వీసా కోసం 8,838 దరఖాస్తులు వచ్చాయని, ఈ సంఖ్య 2023లో 18,994కు చేరిందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. ఈ పెరుగుదలలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని సమాచారం. 2023లో అత్యధికంగా ఈ వీసాలు పొందిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూకే, బ్రెజిల్ ముందు వరుసలో ఉండగా 1418 వీసాలతో భారత్ మూడో స్థానంలో ఉందట. హెచ్1బీతో పోలిస్తే ఈ వీసా ప్రక్రియ కొంత సులభంగా ఉంటుందని, అందుకే దీని పాపులారిటీ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.






