రైలు పట్టాలపై సోలార్‌ ప్యానెళ్లు.. రైల్వే చరిత్రలో వినూత్న ప్రయోగం.. రైల్వే శాఖ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

దేశంలోనే తొలిసారిగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.

రైలు పట్టాలపై సోలార్‌ ప్యానెళ్లు.. రైల్వే చరిత్రలో వినూత్న ప్రయోగం.. రైల్వే శాఖ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రైల్వే (Indian Railways) ఒక వినూత్న ప్రయోగాన్ని ఆవిష్కరించింది. దేశంలోనే తొలిసారిగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో రైలు పట్టాల మధ్యలో (solar panels) సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా (Ministry of Railways) భారత రైల్వే శాఖ ఆసక్తికర పోస్ట్ చేసింది. సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు భారతీయ రైల్వేలో చారిత్రాత్మకంగా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. బనారస్‌ లోకోమోటివ్ వర్క్స్ వద్ద మొదట సారిగా 70 మీటర్ల సోలార్ ప్యానెల్ వ్యవస్థను ప్రారంభించినట్లు పేర్కొంది. ఇందులో 28 ప్యానెల్‌లు, 15‌కెడబ్ల్యూపీ పవర్ పట్టించే విధంగా రెండు పట్టాలకు మధ్య అమర్చారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రైల్వే శాఖ ప్రారంభించింది.

కాగా, దీనివల్ల రైలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ ప్యానెళ్లను కావాల్సినప్పుడు తొలగించుకునే సౌకర్యం కూడా ఉంది. రైలు పట్టాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఇది రైల్వే కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వేలో బొగ్గు, ఇంధనం వంటి వినియోగాన్ని తగ్గించి.. తక్కువ స్పేస్‌లో పర్యావరణ కాలుష్యం లేకుండా రైల్వేకు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక, సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రయోగంపై నెటిజన్‌లు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని వారు రైల్వే శాఖను కోరారు. అయితే వాటికి సెక్యూరిటీ చాలా అవసరమని, దొంగలు ప్యానెళ్లు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుందని చాలా మంది నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు.

Next Story