US: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష

by Shamantha N |

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమన్ దీప్ సింగ్ అనే వ్యక్తి మద్యం, డ్రగ్స్ తీసుకుని అతివేగంగా వాహనం నడపడంతో ఇద్దరు టీనేజర్లు చనిపోయారు.

US: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమన్ దీప్ సింగ్ అనే వ్యక్తి మద్యం, డ్రగ్స్ తీసుకుని అతివేగంగా వాహనం నడపడంతో ఇద్దరు టీనేజర్లు చనిపోయారు. దీంతో లాంగ్ ఐలాండ్ కోర్టు అతడికి గరిష్ఠంగా 25 ఏళ్లు.. కనిష్ఠంగా 8 ఏళ్ల 4 నెలల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి హెలీన్ గుగెర్టీ తీర్పు చెప్పారు. అయితే, న్యాయమూర్తి గుగెర్టీ విధించిన శిక్ష ప్రకారం.. అమన్ దీప్ సింగ్ పెరోల్‌ పొందేందుకు ముందు కనీస శిక్షను అనుభవించారు. జైలులో అతని ప్రవర్తన సహా పలు విషయాల ఆధారంగా అతను పెరోల్ పొందుతాడు. ఒకవేళ, పెరోల్ కు అర్హత పొందకపోతే 25 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

నిండిపోయిన కోర్టు హాల్

అయితే, శిక్ష విధించే ముందు కోర్టుకు మృతులకు మద్దతుగా భారీగా యువత హాజరయ్యారు. వారికోసం అదనంగా కోర్టుకు చెందిన రెండు గదులను తెరిచారు. ఇకపోతే, 36ఏళ్ల అమన్ దీప్ సింగ్ ఒక నిర్మాణ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. మే 2023లో 65 కి.మీ. పరిమితి ఉన్న జోన్ లో 150 కి.మీ వేగంతో తన ట్రక్కుని నడిపాడు. అంతే కాక రాంగ్ రూట్ లో అతడు మితిమీరిన వేగంతో నడపడంతో నలుగురు టీనేజర్లను ఢీకొట్టారు. వారిలో ఇద్దరు చనిపోయారు. మృతులు ఇద్దరు పద్నాలుగేళ్ల టెన్నిస్ ప్లేయర్లు అని అధికారులు తెలిపారు. టెన్నిస్ మ్యాచ్ గెలిచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ప్రమాదం తర్వాత పారిపోయిన అమన్ దీప్ సింగ్ ని పోలీసులు వెతికి పట్టుకుని అరెస్టు చేశారు.

Next Story