టెక్ దేశం ఏర్పాటు కోసం ఐలాండ్ కొనేసిన భారత సంతతి బిజినెస్‌మ్యాన్!

by Phanindra |   (  Updated:2025-07-02 17:05:37  IST  )

టెక్ దేశం ఏర్పాటు కోసం ఐలాండ్‌ను భారత సంతతి బిజినెస్‌మ్యాన్ కొనేశారు. ‘ది నెట్‌వర్క్ స్టేట్’ ఏర్పాటే తన లక్ష్యమని బాలాజీ శ్రీనివాసన్ తెలిపారు.

టెక్ దేశం ఏర్పాటు కోసం ఐలాండ్ కొనేసిన భారత సంతతి బిజినెస్‌మ్యాన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: టెకీలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం కొత్త దేశాన్ని సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నాడో భారత సంతతి ఆంత్రప్రెన్యూర్. యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన బాలాజీ శ్రీనివాసన్.. తన కలలో భాగంగా ఇటీవలే సింగపూర్ సమీపంలో ఒక ప్రైవేటు ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. కాయిన్‌బేస్ మాజీ సీటీవో, కౌన్సీల్ ఇన్‌కార్పొరేషన్ కో-ఫౌండర్ అయిన శ్రీనివాసన్.. టెక్నాలజిస్టులు, వ్యవస్థాపకులు, ఇన్నొవేటర్ల కోసం ‘నెట్‌వర్క్ స్టేట్’ అనే డీసెంట్రలైజ్డ్, డిజిటల్ ఫస్ట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.

ఈ విషయంపై తన ఆలోచనలను ‘ది నెట్‌వర్క్ స్టేట్’ అనే పుస్తకంలో పంచుకున్నారు. తాజాగా సింగపూర్ సమీపంలోని ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన శ్రీనివాసన్.. ‘మనం ఒక ద్వీపాన్ని కొనేశాం. బిట్‌కాయిన్ పవర్‌తో సింగపూర్ సమీపంలో అందమైన ఐలాండ్ మన సొంతమైంది. ఇక్కడ నెట్‌వర్క్ స్కూల్ నిర్మిస్తున్నాం’ అని ప్రకటించారు. ఇక్కడ మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, తన ‘నెట్‌వర్క్ స్టేట్’ లక్ష్యాల్లో శిక్షణ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు.

‘ది నెట్‌వర్క్ స్కూల్’లో 90 రోజులపాటు ఫిజికల్ ఫిట్‌నెస్, ఏఐ, బ్లాక్‌చైన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ వంటి అత్యాధునిక కోర్సులు, ఇన్నొవేషన్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని శ్రీనివాసన్ వెల్లడించారు. సెప్టెంబరు 23 నుంచి డిసెంబరు 23 వరకు ఈ ద్వీపంలో శిక్షణ ఉంటుందని తెలియజేశారు.

Next Story