మార్కెట్‌ వనరులను బట్టే.. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత!

by Phanindra |

మార్కెట్‌ వనరులను బట్టే తాము చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్ తెలిపింది. రష్యా చమురు కొనుగోళ్లపై యూఎస్ విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

మార్కెట్‌ వనరులను బట్టే.. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా తప్పుపట్టడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. అదే క్రమంలో భవిష్యత్తులో భారత్‌కు పాకిస్తాన్ కూడా ఆయిల్ అమ్ముతుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు జైస్వాల్ నిరాకరించారు.

అలాగే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ విమర్శలపై స్పందిస్తూ.. ‘ఎనర్జీ అవసరాలను తీర్చుకోవడంపై భారత్ చాలా విశాలమైన అప్రోచ్‌తో ముందుకెళ్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న వనరులు, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం’ అని వివరించారు. అయితే భారత్‌కు చెందిన కొన్ని ఆయిల్ కంపెనీలు తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేశాయి.

ఈ వివరాలు తమకు పూర్తిగా తెలియదని జైస్వాల్ చెప్పుకొచ్చారు. ఇటీవల యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో మాట్లాడుతూ.. ‘భారత్‌కు భారీగా ఎనర్జీ అవసరాలున్నాయి. రష్యన్ చమురుపై ఆంక్షలు విధించారు. కాబట్టి అది మార్కెట్లో చీప్‌గా దొరుకుతోంది. అంతర్జాతీయ ధర కన్నా తక్కువకు రష్యా చమురు అమ్ముతోంది. కాబట్టి భారత్ దీన్ని కొనుగోలు చేస్తోంది. ఇది ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఉపయోగపడుతోంది. ఇది ఇండియా-యూఎస్ సంబంధాల్లో సమస్యగా మారుతోంది’ అని అన్నారు.

Next Story