పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ ఇన్ఫర్మేషన్ లీక్.. నేవీ ఉద్యోగి అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-25 22:30:46  IST  )

భారత రక్షణ వ్యవస్థకు చెందిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను పాకిస్థాన్‌కు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్న ఓ నేవీ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా చిక్కాడు.

పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ ఇన్ఫర్మేషన్ లీక్.. నేవీ ఉద్యోగి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ వ్యవస్థకు చెందిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను పాకిస్థాన్‌కు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్న ఓ నేవీ ఉద్యోగి పోలీసులకు అడ్డంగా చిక్కాడు. ఢిల్లీలోని నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న హరియాణాకు చెందిన విశాల్ యాదవ్‌ను రాజస్థాన్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అతడు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాజస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. విశాల్ యాదవ్‌ సోషల్ మీడియా వేదికగా పాక్ హ్యాండ్లర్‌తో సంప్రదింపులు కొనసాగించేవాడిగా గుర్తించారు. ‘ప్రియా శర్మ’ అనే పేరు ఉపయోగించి ఆ పాక్ మహిళా హ్యాండ్లర్‌ అతడికి డబ్బు ఆశ చూపి, భారత నౌకాదళానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. అతని ఫోన్‌ను పరిశీలించిన తర్వాత నేవీతో పాటు ఇతర రక్షణ విభాగాలకు సంబంధించిన ఎన్నో కీలక సమాచారం లీక్ చేసినట్లు వెల్లడైంది.

ఇటీవల భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)కు సంబంధించిన సమాచారం కూడా పాకిస్థాన్‌కు చేరినట్లు గుర్తించగా, ఇది గమనార్హ అంశమని అధికారులు తెలిపారు. డబ్బుల ప్రలోభానికి లోనై విశాల్ దేశ భద్రతను పక్కనబెట్టి గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై డబ్బులు కోల్పోయిన అతను.. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడం కోసం ఈ చర్యలకు పాల్పడ్డట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

క్రిప్టో కరెన్సీ వాలెట్‌లు, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు స్వీకరించినట్లు ఆధారాలు దొరికినట్లు రాజస్థాన్ సీఐడీ ఐజీ విష్ణుకాంత్ గుప్తా తెలిపారు. ఢిల్లీలో అతడిని అదుపులోకి తీసుకుని జైపూర్‌కి తరలించిన అనంతరం.. పలు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు, స్థానిక పోలీసులు కలిసి అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు.

ఈ గూఢచర్యంలో మరికొందరు ఉన్నారా? ఎలాంటి సమాచారం లీక్ అయిందన్నది తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా విదేశీ హ్యాండ్లర్ల ద్వారా భారత రక్షణ వ్యవస్థలోకి చొరబడే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద చర్యలు కనిపించిన వెంటనే భద్రతా సంస్థలకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story