- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DY Chandrachud: కోర్టులు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే ఉన్నాయి- సీజేఐ
దేశంలోని కోర్టులు, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానం వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే ఉందనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని కోర్టులు, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానం వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే ఉందనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారతీయ న్యాయవ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీబీసీ హార్డ్‌టాక్ ఇంటర్వ్యూలో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారతీయ న్యాయవ్యవస్థలో పురుషాధిపత్యం నుండి రామ జన్మభూమి కేసు, ఆర్టికల్ 370 కేసు వంటి కీలక తీర్పుల వంటి ప్రశ్నాలకు ఆయన జవాబిచ్చారు. హిందువుల్లోని అగ్రకులాలు, పురుషుల ఆధిపత్యం ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు. న్యాయవ్యవస్థలో ఉన్నత కులాల ఆధిపత్యం ఏమీ లేదని, ఇప్పుడిప్పుడే న్యాయ వ్యవస్థలోకి మహిళల ప్రవేశం పెరిగిందన్నారు. ప్రస్తుతం న్యాయ విద్య అందరికీ అందుతున్నదని, దీంతో మహిళలు కూడా ఈ ప్రొఫెషన్‌లోకి ప్రవేశిస్తున్నారని, జిల్లా న్యాయస్థానాల్లో మహిళల సంఖ్య పెరిగిందని, రాబోయే రోజుల్లో వాళ్లు సుప్రీం వరకు చేరుకుంటారన్నారు. తన తండ్రి వైవీ చంద్రచూడ్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నఉన్నారని, కానీ ఆ సమయంలో కోర్టుకు రావొద్దు అని తన తండ్రి ఆదేశించారని, దాని వల్ల మూడేళ్ల పాటు హార్వర్డ్ లా స్కూల్‌లోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించినట్లు డీవై చంద్రచూడ్ తెలిపారు. తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. భారతీయ న్యాయవ్యవస్థలోని ఓవరాల్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, చాలా వరకు లాయర్లు, జడ్జీలు అందరూ ఫస్ట్ టైం ఎంట్రీలే అన్నారు.
మోడీ సర్కారు నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నారా?
మోడీ సర్కారు నుంచి ఏమైనా ఒత్తిడి ఎదుర్కొన్నారా అని మాజీ సీజేఐకు ప్రశ్న ఎదురయ్యింది. అధికార బీజేపీ హక్కుల కోసం కోర్టులపై ఆధారపడిందనే న్యూయార్క్ టైమ్స్‌లోని కథనాన్ని జర్నలిస్టు ఉటంకించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు భారత్ ఒకే పార్టీ గల దేశంగా అవతరిస్తుందనే అపోహను తుడిపేశాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఆ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయని, ఆ పార్టీలు తమతమ రాష్ట్రాలను పాలిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370, సీఏఏ, అయోధ్య రామాలయ తీర్పులపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో .. పార్లమెంట్‌లో ప్రతిపక్షం పోషించే పాత్రను న్యాయవ్యవస్థ పోషించలేదన్నారు. కోర్టులో తాము ఉండేది కేసుల్ని పరిష్కరించేందుకు అని, అది కూడా చట్టం పరిధిలో జరుగుతుందని మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలిన విషయం గురించి అడగ్గా.. సుప్రీంకోర్టు ఆ తర్వాత తీర్పుని నిలిపివేసిందన్నారు. "ఉన్నత న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛలను కాపాడటానికే ఇక్కడున్నామనే స్పష్టమైన సందేశాన్ని పంపాయి. వ్యక్తిగత కేసులలో, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యం ఉస్తుంది. ప్రజలకు కోర్టులపై విశ్వాసం ఉందంటే దానికి కారణం ఇదే కారణం" అని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ( political pressure) ఉందనే ఆరోపణలపైనా స్పందించారు. చట్టప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించబడేలా చూసుకోవడం కోసం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తీర్పులో అందరూ నిరాశ చెందారన్న క్వశ్చన్ పైనా స్పందించారు. పరివర్తన నిబంధనను రద్దు చేయడానికి 75 ఏళ్ల కంటే ఎక్కువ సమయం చాలా తక్కువనా? అని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఎన్నికల తర్వాత శాంతియుతంగా అధికార బదిలీ జరిగిందన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఇది స్పష్టమైన సూచిక అని ఆయన అన్నారు.
మోడీతో స్నేహం గురించి..
ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ (PM Modi)తో స్నేహం గురించి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రధాని మీకు బాగా క్లోజా..? అంటూ ప్రశ్నించారు. దీనికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అవునని సమాధానం చెబుతూనే.. మీరు అనుకుంటున్నట్లు కాదని వివరించారు. ప్రధాని తన ఇంటికి రావడంలో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని చెప్పారు. ‘రాజ్యాంగ పరంగా ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, మర్యాదపూర్వక భేటీలు ఉంటాయి. వాటిని అంతకు మించి లోతుగా చూడొద్దు. కేసుల తీర్పులకు ఇలాంటి మర్యాదలకు ఏమాత్రం సంబంధం ఉండదనే పరిణతి మా వ్యవస్థలో ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయన ఇంటికి వెళ్లి గణపతి పూజలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై అప్పట్లోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టతనిచ్చారు. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.






