భారత్ అవమానాలు భరించదు.. యూఎస్ సుంకాలపై పుతిన్ కామెంట్స్

by Phanindra |

భారత దేశం అంతర్జాతీయంగా అవమానాలు భరించదని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారత్‌పై యూఎస్ సుంకాలపై ఆయన ఇలా స్పందించారు.

భారత్ అవమానాలు భరించదు.. యూఎస్ సుంకాలపై పుతిన్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొనకుండా భారత్‌పై యూఎస్ ఒత్తిడి పెంచడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి, అంతర్జాతీయ వేదికపై భారత్ అవమానాలు ఎదుర్కోదని పుతిన్ అన్నారు. సోచిలో జరిగిన వాల్డాయి డిస్కషన్ క్లబ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక సమతుల్య, తెలివైన నాయకుడని కొనియాడిన పుతిన్.. భారత్, రష్యా మధ్య ప్రత్యేకమైన బంధం ఉందని పేర్కొన్నారు.

రష్యా నుంచి చమురు కొనడం అనేది భారత్‌కు పూర్తిగా ఒక ఆర్థిక సంబంధిత లెక్కేనని, దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. తమ ఆయిల్‌ను వ్యతిరేకిస్తే భారత్‌కు కొన్ని సమస్యలు వస్తాయని, అందుకని ఆయిల్ కొనుగోలు ఆపకపోతే ఆంక్షల వల్ల కూడా దాదాపుగా అంతే నష్టం జరుగుతుందని పుతిన్ వివరించారు. దేశీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆయిల్ కొనడం ఎందుకు ఆపాలని ప్రశ్నించారు.

‘భారత ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గమనిస్తూనే ఉంటారు. అంతర్జాతీయ వేదికపై దేశం ఏమాత్రం అవమానం ఎదుర్కోవడాన్ని వాళ్లు సహించరు. ఇక ప్రధాని మోడీ గురించి కూడా నాకు తెలుసు. ఆయన అలాంటి నిర్ణయాలేవీ తీసుకోరు. అమెరికా ఆంక్షల వల్ల భారత్‌ ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను.. రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా బ్యాలెన్స్ చెయ్యవచ్చు. అదే సమయంలో సార్వభౌమాధికారం ఉన్న దేశంగా పరపతి కూడా సంపాదిస్తుంది’ అని పుతిన్ వివరించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలు వేసిన సంగతి తెలిసిందే.

Next Story