ఒకే రోజు కూలిన రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు

by Ajay Maddhiboyina |

మరో విమాన ప్రమాదం వెస్ట్ బెంగాల్‌లోని బగ్దోరా ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది.

ఒకే రోజు కూలిన రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు
X

- గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల ఘటనలు

- వాయు సేన చరిత్రలో ఇదే మొదటి సారి

- పైలెట్లు, సిబ్బంది సురక్షితం

దిశ, నేషనల్ బ్యూరో: భారత వాయు సేన(ఐఏఎఫ్)కు చెందిన రెండు విమానాలు గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల కుప్పకూలాయి. అయితే ఈ ఘటనలో పైలెట్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఐఏఎఫ్‌కు చెందిన జాగర్వ్ యుద్ద విమానం శుక్రవారం ఉదయం అంబాలా సమీపంలో కూలింది. రోజువారీ ట్రైనింగ్‌లో భాగంగా ఈ విమానాన్ని ఉపయోగించగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ నివాసాలకు దూరంగా తీసుకెళ్లిన తర్వాత విమానంలో నుంచి ఎజెక్ట్ అయ్యాడు. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. విమానం కూలడానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. పంచకుల జిల్లాలోని మోర్నీ పర్వత ప్రాంతంలో జాగ్వర్ యుద్ద విమానం కూలిపోయినట్లు చండీఘర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కలగలేదని, పైలెట్ సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇక మరో విమాన ప్రమాదం వెస్ట్ బెంగాల్‌లోని బగ్దోరా ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఐఏఎఫ్‌కు చెందిన ఎఎన్-32 రవాణా విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే ఘటనా స్థలం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ఘటనలో పైలెట్, సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేసింది. కాగా, భారత వాయుసేన చరిత్రలో ఒకే రోజు ఇలా రెండు విమానాలు కూలడం అసాధారణమైన విషయం. ఇలాంటి సంఘటనలు అరుదుగానే జరుగుతుంటాయి. దీంతో ఈ రెండు ఘటనలపై వాయుసేన పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది.

ఇండియాలో ప్రస్తుతం ఆరు స్క్వాడ్రన్ల జాగ్వర్ విమానాలు ఉన్నాయి. ప్రపంచంలో జాగ్వర్ యుద్ద విమానాలను కేవలం భారత వాయుసేన మాత్రమే ఉపయోగిస్తోంది. ఈ విమానాలను 1979లో యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ తర్వాత సంబంధిత లైసెన్సులు పొంది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. ఇక ఏఎన్-32 రవాణా విమానాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఐఏఎఫ్ వీటికి ప్రత్యామ్నాయాలను వెదికే పనిలో ఉంది. త్వరలోనే ఈ విమానాలను కూడా కొత్త వాటితో రీప్లేస్ చేయనున్నట్లు తెలిసింది.

Next Story