అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు: పాకిస్తాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక

by Ramesh Naini |

అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు: పాకిస్తాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తిప్పికొట్టింది. దేశ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించబోమని భారత్ గట్టి హెచ్చరికలు చేసింది. డీలిమిటేషన్ వ్యవహారం పూర్తిగా తమ దేశ అంతర్గత విషయమని, దీనిపై ఇతరుల విమర్శలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. తమ దేశీయ ప్రక్రియల్లో పాక్ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లు-2026లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)కు సంబంధించిన అంశాలపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది వివాదాస్పద ప్రాంతంలో రెచ్చగొట్టే చర్య అని, చట్టవిరుద్ధమని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ఆరోపించారు.

బిల్లులో ఏముంది?

కాగా, ఏప్రిల్ 16న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, జమ్మూకశ్మీర్‌తో పాటు పీఓకేలోనూ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టే అధికారాన్ని ఎన్నికల సంఘానికి కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా భవిష్యత్తులో లోక్‌సభ స్థానాలను 543 నుంచి సుమారు 850కి పెంచే అవకాశం ఉంది.

భారత్ స్థిరమైన విధానం

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇప్పటికే పీఓకే ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి (వాటికి ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు). పీఓకేతో సహా జమ్మూకశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమేనన్నది న్యూఢిల్లీ స్థిరమైన విధానం. ఈ తాజా బిల్లు ద్వారా పీఓకేపై భారత్ తన రాజ్యాంగ బద్ధమైన హక్కును, సార్వభౌమత్వాన్ని మరోసారి ప్రపంచానికి తేల్చిచెప్పింది.

Next Story