రక్షణకు మరో రూ.50 వేల కోట్లు.. శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన!

by Phanindra |

రక్షణ రంగానికి మరో రూ.50 వేల కోట్లు కేటాయించనున్న కేంద్రం. శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధం.

రక్షణకు మరో రూ.50 వేల కోట్లు.. శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన!
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’తో భారత ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే రక్షణ బడ్జెట్‌కు మరో రూ.50 వేల కోట్లు కేటాయించాలని కేంద్రం భావిస్తోందట. 2025-26 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లను కేటాయించారు. ఇప్పుడు అదనంగా మరో రూ.50 వేల కోట్లు కేటాయిస్తే రక్షణ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు దాటేస్తుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ అదనపు కేటాయింపుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పరిశోధన, కొత్త ఆయుధాల అభివృద్ధితోపాటు అమ్యూనిషన్, ఇతర అత్యవసర పరికరాల కొనుగోలు కోసం ఈ డబ్బును కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.

2014లో తొలిసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రక్షణ రంగానికి కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయి. 2014-15 బడ్జెట్‌లో రూ.2.29 లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కారు.. ఈసారి దీన్ని రూ.6.81 లక్షల కోట్లకు పెంచింది. ఇది మొత్తం బడ్జెట్‌లో 13 శాతం కావడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌పై చేసిన ‘ఆపరేషన్ సిందూర్‌’లో భారత్ దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతోపాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఎస్400 వంటి వ్యవస్థలు కూడా అద్భుతంగా పనిచేశాయి. అయితే ఇతర దేశాల నుంచి రక్షణ రంగం కొనుగోళ్లు తగ్గించాలని, మన ఆయుధాలను మనం తయారుచేసుకోవడమే భవిష్యత్తులో ప్రయోజనకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చెప్పారు. ఈ క్రమంలోనే రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెంచనున్నట్లు తెలుస్తోంది.

Next Story