ఇండియాపై విధించిన టారిఫ్‌లను తగ్గించే అవకాశం?

by Ajay Maddhiboyina |

ఏప్రిల్ 2 నుంచి వాళ్లు వసూళ్లు చేసే సుంకాలను మేము కూడా వారి నుంచి వసూలు చేస్తామని ట్రంప్ చెప్పారు.

ఇండియాపై విధించిన టారిఫ్‌లను తగ్గించే అవకాశం?
X

- అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు

- సానుకూలంగా ఉన్నాయన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

- మోడీ చాలా తెలివైన వ్యక్తి.. నాకు గొప్ప స్నేహితుడని పునరుద్ఘాటన

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై పరస్పర సుంకాలు విధించాలని తన అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి తెస్తున్నా.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనకు గొప్ప స్నేహితుడని.. అతను చాలా తెలివైన వ్యక్తని చెప్పారు. అయితే ఇండియా విధిస్తున్న అధిక సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఇటీవలే ఇక్కడకు వచ్చారు. మేము ఎప్పుడూ చాలా మంచి స్నేహితులుగానే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటి. వారు చాలా తెలివైన వారని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ కూడా చాలా తెలివైన వ్యక్తి. అయితే మేం చాలా మంచి చర్చలు చేశాము. ఇండియా, అమెరికా మధ్య సానుకూల వాతావరణానికి ఇది తప్పకుండా పని చేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇండియాకు ఒక గొప్ప ప్రధాని ఉన్నాడని తాను చెప్పదలచుకున్నానని ట్రంప్ అన్నారు. భారత్-కఇండియా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, వీటి వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇండియాతో సహా పలు దేశాలపై పరస్పర సుంకాలను విధించడానికి అమెరికా సన్నద్దమవుతున్నసమయంలో, ఇరుర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇండియాను టారిఫ్ కింగ్ అని వ్యవహరించారు. ఇండియా విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా అన్యాయమైనవి, చాలా భారీగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. నాకు ఇండియాతో మంచి సంబంధమే ఉంది. కానీ ఆ దేశంతో నాకు ఉన్న ఏకైక సమస్య టారిఫ్‌లే అని ట్రంప్ మరోసారి చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటని ట్రంప్ ఆరోపించారు. అయితే ఆ సుంకాలను ఇండియా గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు.

ఏప్రిల్ 2 నుంచి వాళ్లు వసూళ్లు చేసే సుంకాలను మేము కూడా వారి నుంచి వసూలు చేస్తామని ట్రంప్ చెప్పారు. అయితే సుంకాలపై ఉద్రిక్తలను తగ్గించే లక్ష్యంతో అమెరికాతో ఇండియా వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి గణనీయమైన చర్యలు తీసుకుంది. గత ఏడాది అమెరికా నుంచి 15 బిలియన్ డాలర్ల ఇంధనాన్ని కొనుగోలు చేయగా.. దాన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ భావిస్తోంది. అంతే కాకుండా బోర్బన్ విస్కీ, లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్, యంత్రాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాలను కూడా తగ్గించింది. గరిష్ట దిగుమతి సుంకాలను 70 శాతానికి.. సగటు సుంకాలను 11 శాతం కంటే తక్కువకు తగ్గించింది. భారత్ సుంకాలను భారీగా తగ్గించడంతో ఏప్రిల్ 2 తర్వాత అమెరికా విధిస్తానన్న సుంకాలు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story