- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు ‘రణ్‌బీర్’ దెబ్బ.. చీనాబ్‌పై కాలువ సామర్థ్యం రెట్టింపు చేయాలని భారత్ ప్లాన్
పాకిస్తాన్‌ను ‘రణ్‌బీర్ కాలువ’తో కొట్టాలని భారత్ ప్లాన్ వేస్తోంది. ఈ కాలువతో చీనాబ్ నది నీటిని భారీగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు మరో షాకిచ్చేందుకు భారత్ సిద్ధం అవుతోంది. పాక్‌కు భారీగా నీటిని తీసుకెళ్లే చీనాబ్ నది నుంచి భారీఎత్తున నీటిని తరలించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. రణ్‌బీర్ కాలువతో ఈ నది నుంచి కొద్దిపాటి నీటిని భారత్ తీసుకుంటోంది. ఇప్పుడు ఈ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి మరిన్ని జలాలను తరలించేందుకు భారత్ సిద్ధమవుతోందట. ఈ కాలువ సింధూ జలాల ఒప్పందం చేసుకోవడం కన్నా ఎన్నో దశాబ్దాల ముందే ఏర్పాటైంది. ప్రస్తుతం దీని ద్వారా సెకనుకు 40 క్యూబిక్ మీటర్ల నీటిని భారత్ తీసుకుంటోంది. ఈ సామర్థ్యాన్ని సెకనుకు 150 క్యూబిక్ మీటర్లకు పెంచాలని భారత ప్రభుత్వం అనుకుంటోందట. ఈ ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే చాలా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.
డ్యాంలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు..
వీటితోపాటు చీనాబ్, జీలం, సింధూ నదులపై డ్యాంలతోపాటు హైడ్రోపవర్ ప్రాజెక్టులు కూడా నిర్మించాలని భారత్ అనుకుంటున్నట్లు సమాచారం. వీటి వల్ల నీటితోపాటు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని ప్రాజెక్టుల ద్వారా కేవలం 3,360 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ కొత్త ప్రాజెక్టులతో ఈ సామర్ధ్యాన్ని ఏకంగా 12000 మెగావాట్లకు పెంచాలనేది భారత్ ప్లాన్. అలాగే చీనాబ్, జీలం నదులపై కనీసం నాలుగు డ్యాంలు కూడా నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోందట.
పహెల్గాం తర్వాత ఒప్పందం నిలుపుదల..
సింధూ జలాల ఒప్పందం వల్ల చీనాబ్, జీలం, సింధూ నదుల నీటిపై భారత్‌కు నామమాత్రపు హక్కు మాత్రమే దక్కుతుంది. జనాభా పెరుగుదల వల్ల ఈ ఒప్పందంపై మరింత చర్చ జరపాలని పాకిస్తాన్‌ను భారత్ పలుమార్లు పిలిచినా పాక్ స్పందించలేదు. ఈ నదీ జలాలపై ఎలాంటి ప్రాజెక్టులు కట్టినా, నీటిని దారి మళ్లించాలని చూసినా, నిల్వ చేసినా దాన్ని యుద్ధచర్యగా భావిస్తామంటూ పలుమార్లు భారత్‌కు దాయాది దేశం హెచ్చరికలు చేసింది. అయితే పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ‘నీరు, నెత్తురు ఒకే చోట ప్రవహించలేవు’ అంటూ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.






