PM Modi: మే నెలలో సింహాల గణన: ప్రధాని మోడీ

by S Gopi |

ఆయన వెంట కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఇతర అటవీశాఖ అధికారులు ఉన్నారు.

PM Modi: మే నెలలో సింహాల గణన: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆసియాటిక్ సింహాల జనాభా అంచనాను ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ లయన్‌ సఫారీ చేశారు. ఆయన వెంట కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఇతర అటవీశాఖ అధికారులు ఉన్నారు. జునాగఢ్‌లో నేషనల్ రెఫరల్ సెంటర్-వైల్డ్‌లైఫ్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ రివర్ డాల్ఫిన్‌లపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా తమిళనాడులోని కోయంబత్తూరులో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణ కోసం ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 'భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ, జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు అందరం కృషి చేయాలని పిలుపుని'చ్చారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ, దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సమిష్టి కృషి వల్లనే సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోందని, ఆసియాటిక్ సింహాల ఆవాసాలను కాపాడుకోవడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న గిరిజనుల సహకారాన్ని ప్రశంసించారు. కాగా, గుజరాత్‌లో మాత్రమే కనిపించే ఆసియా సింహాలను సంరక్షించే లక్ష్యంతో ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లకు పైగా ఆమోదించింది. ప్రస్తుతం, ఆసియాటిక్ సింహాలు గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాల్లో 53 తాలూకాలలో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.

Next Story