- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊబకాయం, పోషకాహార లోపం మధ్య నలుగుతున్న భారత్.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే షాకింగ్ నివేదిక
దేశంలో ప్రజల ఆరోగ్యం తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఒకవైపు ఊబకాయం, మరోవైపు పోషకాహార లోపం వెరసి భారత్ ‘ద్వంద్వ ఆరోగ్య ముప్పు’ను ఎదుర్కొంటోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ప్రజల ఆరోగ్యం తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఒకవైపు ఊబకాయం, మరోవైపు పోషకాహార లోపం వెరసి భారత్ ‘ద్వంద్వ ఆరోగ్య ముప్పు’ను (Double burden) ఎదుర్కొంటోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడుతుండగా, జీవనశైలి వ్యాధులు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ వేగంగా విస్తరిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను 715 జిల్లాల్లోని సుమారు 6.79 లక్షల గృహాల్లో నిర్వహించిన ఈ సర్వే గణాంకాలను శుక్రవారం విడుదల చేశారు.
వేగంగా పెరుగుతున్న స్థూలకాయం (Obesity)
గత సర్వేలో (2019-21) 24 శాతంగా ఉన్న ఊబకాయ మహిళల సంఖ్య తాజా సర్వే నాటికి 30.7 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25.5% కాగా, పట్టణాల్లో ఏకంగా 42.8 శాతంగా ఉంది. పురుషుల్లో 22.9 శాతం నుంచి 27.3 శాతానికి పెరిగింది (పట్టణాల్లో 36.3%, గ్రామాల్లో 23%) గా ఉంది.
విస్తరిస్తున్న మధుమేహం
అధిక బ్లడ్ షుగర్ (>140mg/dl) తో బాధపడుతున్న లేదా మందులు వాడుతున్న పురుషుల సంఖ్య 15.6% నుంచి 20.9 శాతానికి జంప్ అయింది. మహిళల్లోనూ ఈ సంఖ్య 13.5% నుంచి 17.8 శాతానికి చేరింది. ఒకవైపు కొవ్వు పెరుగుతుంటే, మరోవైపు సరైన పోషకాలు లేక సాధారణం కంటే తక్కువ బీఎంఐ (BMI) ఉన్న పురుషుల శాతం 16.2% నుంచి 19.7 శాతానికి పెరగడం ఆహార అభద్రతకు అద్దం పడుతోంది. అయితే, మహిళల్లో పోషకాహార లోపం 19.7% నుంచి 15 శాతానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం.
పెరుగుతున్న సిజేరియన్లు..
ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల (C-Section) ద్వారా ప్రసవాల సంఖ్య 47.4% నుంచి 54.1 శాతానికి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇది 14.3% నుంచి 16.9 శాతానికి పెరిగింది. ఇక, 5 ఏళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపం (Stunting) 35.5% నుంచి 29.3 శాతానికి తగ్గింది. మద్యం సేవించే పురుషుల శాతం 18.7 నుంచి 18.9 కి స్వల్పంగా పెరిగింది.
కారణాలేంటి? వైద్యుల హెచ్చరికలు
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (ప్యాక్ చేసిన ఆహారం) వాడకం విపరీతంగా పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, నిద్రలేమి, ఒత్తిడి ఈ మెటబాలిక్ వ్యాధులకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, భారతీయుల శరీర నిర్మాణంలో ఉండే ‘థిన్-ఫ్యాట్ ఫెనోటైప్’ (బరువు తక్కువ ఉన్నా అవయవాల చుట్టూ కొవ్వు చేరడం) లక్షణం వల్ల.. పైకి లావుగా కనిపించని వారిలో కూడా గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ తదితర ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. తక్షణం జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే భవిష్యత్తులో దేశం తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.






