Pakistan: సింధూ నదీ జలాల ఒప్పందం ఏంటి? పాక్ కు కలిగే నష్టాలివే..

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Pakistan: సింధూ నదీ జలాల ఒప్పందం ఏంటి?  పాక్ కు కలిగే నష్టాలివే..
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం వల్ల పాక్ కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి కాలంలో జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, నీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల పాక్ ఇప్పటికే నీటి కొరతతో సతమతమవుతోందని నిపుణులు హెచ్చరించారు. గతంలో సింధు ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ప్రణాళిక సిద్ధం అవుతుండగా.. ఈ ఒప్పందం నుండి నిష్క్రమించే చర్యను ఇస్లామాబాద్ "యుద్ధ చర్య"గా భావిస్తుందని పాక్ చెప్పింది.

1960లో ఇరు దేశాల మధ్య ఒప్పందం

సింధు నది, దాని ఉపనదుల జలాలను పంచుకునేందుకు పాక్- భారత్ మధ్య 1960 సెప్టెంబరులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. దీనిపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ (Pakistan) అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్‌ ఎకరాల అడుగులు (MAF)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎమ్‌ఏఎఫ్‌గా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. పశ్చిమ నదుల జలాల్లో భారత్‌ వాటాను సేద్యానికి పరిమితంగా.. జలవిద్యుత్‌ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘శాశ్వత సింధు కమిషన్‌ (PAC)’ను ఏర్పాటుచేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి.

వివాదాలు..

గత ఆరు దశాబ్దాల్లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవీ అడ్డురాలేదు. కానీ, ఇటీవల కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. 2019లో పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ఆలోచన చేశారు. రక్తం, నీరు ఒకేచోట కలిసి ప్రవహించలేవని భద్రతా కేబినెట్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆ సమయంలో దాన్ని అమలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరోవైపు, సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమనిబంధనలపై మరోసారి సమీక్ష జరపాల్సి ఉందని భారత్‌ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి పర్యావరణ, భౌగోళిక, రాజకీయపరంగా మార్పులు జరిగాయని గుర్తుచేసింది. అందుకే వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరింది. అయితే, దీనిపై పాక్‌ మాత్రం వ్యతిరేకత వ్యక్తంచేస్తూ వస్తోంది. జీలం, చినాబ్‌లపై భారత్ నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై ఇస్లామాబాద్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్‌ సాగు కోసం పరిమితంగా, జలవిద్యుత్‌ కోసం గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. దీంతో, కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పాక్ వివాదం రాజేసింది. మరోసారి మధ్యవర్తిత్వం వహించాలని ప్రపంచబ్యాంకున కోరింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఇటీవలే దీనిపై చర్యలు తీసుకుంది. పరిష్కారం కోసం ఒక న్యూట్రల్ ఏజెన్సీని నియమించింది. కాగా.. ఇలాంటి సమయంలో భారత్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Next Story