- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమాసియా యుద్దంపై స్పందించిన భారత్
పశ్చిమాసియా యుద్దంపై భారత్ స్పందించింది. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌పై ఇజ్రాయెల్, యూఎస్ మిలిటరీ దాడులు చేయడం, ఇరాన్ కూడా ప్రతిదాడులు చేయడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ప్రాంతంలో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది. ‘అందరూ నియంత్రణ పాటించి, పరిస్థితి హద్దు మీరకుండా చూసుకోవాలని కోరుతున్నాయం. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వండి. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకొని, సమస్యలను పరిష్కరించుకోవాలి. దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతలను పరస్పరం గౌరవించుకోవడం మేలు’ అని ప్రకటించింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న భారతీయులను కాంటాక్ట్ చేసేందుకు ఆయాదేశాల్లోని భారత ఎంబసీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎంబసీ హెచ్చరికలు..
మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు విదేశాంగ శాఖ కీలక అడ్వయిజరీలు జారీచేసింది. ఖతార్‌లో ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని దోహాలో ఉన్న భారత ఎంబసీ తెలిపింది. స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు కూడా పాటించాలని కోరింది. ఇదే క్రమంలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకు హెల్ప్‌లైన్, ఈమెయిల్‌ను కూడా విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో కూడా ఉన్న భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత ఎంబసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ అధికారులు జారీచేసే సూచనలను పాటించాలని సూచించింది. షెల్టర్లకు సమీపంలో ఉండాలని, తమకు దగ్గరలోని షెల్టర్ల వివరాలు తెలుసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇజ్రాయెల్‌లో కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరింది. స్థానిక వార్తలు చూస్తూ పరిస్థితిని తెలుసుకోవాలని చెప్పిన భారత ఎంబసీ.. ఇక్కడి భారతీయ పౌరుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నెంబర్, ఈమెయిల్‌ను కూడా ప్రకటించింది.
విమానాలు రద్దు..
ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు చెందిన పలు వైమానిక సంస్థలు మిడిల్ ఈస్ట్‌కు వెళ్లే సర్వీసులను రద్దుచేశాయి. ఎయిరిండియా, ఇండిగో వంటి ప్రధాన సంస్థలు కూడా వైమానిక సేవలు నిలిపివేశాయి. దుబాయ్‌లో గగనతలాన్ని మూసేయడం, వాయుమార్గాలు రద్దీగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఈ రెండు సంస్థలే కాకుండా ఇతర వైమానిక దళాలు కూడా ఇదే బాటలో నడుస్తుండటం గమనార్హం.






