ఉగ్రవాదంపై భారత్-న్యూజిలాండ్ ఉమ్మడి గర్జన

by Malleboina Mahesh |

ఉగ్రవాదంపై భారత్–న్యూజిలాండ్ ఉమ్మడి పోరు.. పహల్గామ్, ఎర్రకోట ఉగ్ర ఘటనలపై తీవ్ర ఖండన.. కౌంటర్ టెర్రరిజం జేడబ్ల్యూజీ ఏర్పాటు!

ఉగ్రవాదంపై భారత్-న్యూజిలాండ్ ఉమ్మడి గర్జన
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత్, న్యూజిలాండ్ దేశాలు చేతులు కలిపాయి. ఇరు దేశాల ప్రధాన మంత్రుల ద్వైపాక్షిక భేటీ అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో సరిహద్దు ఉగ్రవాదం తో పాటు అన్ని రకాల ఉగ్రవాద రూపాలను ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడితో పాటు, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రఘటనలను ఇరు నేతలు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించని (Zero-Tolerance) స్థిరమైన విధానాన్ని ప్రపంచ దేశాలు అవలంబించాలని, ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక వనరుల (Terror Financing) నెట్‌వర్క్‌లను మరియు వారి సురక్షిత స్థావరాలను (Safe Havens) పూర్తిగా అణచివేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాయి.

ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇరు దేశాల మధ్య సమాచారం, విజ్ఞానాన్ని పంచుకునేలా 'కౌంటర్-టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్' (JWG) ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoA) పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితి (UN), ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వంటి అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేసేందుకు ఇరు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఐరాస భద్రతా మండలి (UNSC) 1267 ఆంక్షల కమిటీ నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులు మరియు వారి వెనక ఉండి నిధులు సమకూర్చే స్పానర్లపై తక్షణమే, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను డిమాండ్ చేశారు.

Next Story