Boeing 787-8 : బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలకు కేంద్రం బ్రేక్?

by Prasad Jukanti |

అహ్మదాబాద్ లో విమానా ప్రమాదం నేపథ్యంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Boeing 787-8 : బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలకు కేంద్రం బ్రేక్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు బలితీసుకున్న ఎయిరిండియా (Air India) బోయింగ్ 787-౮ (Boeing 787-8) డ్రీమ్ లైనర్ విమానం క్రాష్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను భారత్ లో నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సీరిస్ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం వల్ల ప్రయాణికుల భద్రత దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు భారత్-యూఎస్ ఏజెన్సీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు ఆ వర్గాలు తెలిపారు. అహ్మదాబాద్ ప్రమాద (Ahmedabad plane crash) దర్యాప్తు ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, దాని ఆపరేటింగ్ విధానంపై ఎయిరిండియా సైతం స్క్రూటీని ఎదుర్కోబోతున్నదని తెలుస్తోంది.

డిజాస్టర్ గా డ్రీమ్ లైనర్:

అమెరికాకు చెందిన ప్రముఖ విమానాతయారీ రంగ దిగ్గజం బోయింగ్ సంస్థ 2011 లో ఈ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. విశ్వవిపణిలోకి తొలిసారి అడుగుపెట్టిన సమయంలో ఈ విమానంలోని సదుపాయులు, సామర్థ్యాన్ని చూసిన వారందరిని ఇందులోని ఫీచర్లు, సౌకర్యాలు ఔరా అనిపించాయి. ఈ మోడల్ విమానాలు వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించిన ఈ 14 ఏళ్లలో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. విమానయాన చరిత్రలో మరే ఇతర వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ సాధించలేని మైలురాయిని ఈ సీరిస్ విమానాలు సాధించాయి. బోయింగ్ 787 సీరిస్ లో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. 787-8, 787-9,787-10 మోడల్స్ ఉండగా వీటిలో 787-8 మోడల్ అతి చిన్నదే కాకుండా ప్రవేశపెట్టబడిన మొదటి మోడల్ ఇదే. ఈ 787 మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి బోయింగ్ 2500 కంటె ఎక్కువ విమానాలను విక్రయించింది. ఎయిర్ ఇండియానే 47 కొనుగోలు చేసింది. తనదైన ఫీచర్లతో విమానయాన సంస్థలకు కాసుల వర్షం, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే ఈ డ్రీమ్ లైనర్ విమానాలు అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ప్రయాణికుల పాలిట పీడకలగా మారుతోంది. ఈ విమానాల విషయంలో లోపాలు ఉన్నట్లు గతంలో బోయింగ్ సంస్థ సీనియర్ ఉద్యోగులే ఆరోపణలు చేయడం, క్వాలిటీ అంశాలను ఎత్తిచూపిన పలువురు ఉద్యోగులు అనుమానాస్పద రీతిలో చనిపోవడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ మోడల్ విమానాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story