- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భారత్ మా మిత్రదేశం’.. గ్యాస్ కొరతపై ఇరాన్ కాన్సులేట్ కీలక స్పందన
భారత్‌ను తమ మిత్రదేశంగా, భాగస్వామిగా అభివర్ణించిన ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయీద్ రెజా మొసయెబ్ మొట్లాగ్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత్‌కు వచ్చే గ్యాస్ క్యారియర్లకు సురక్షితమైన మార్గాన్ని కల్పించామని స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) కొరత పట్ల ఇరాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ను తమ మిత్రదేశంగా, భాగస్వామిగా అభివర్ణించిన ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయీద్ రెజా మొసయెబ్ మొట్లాగ్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత్‌కు వచ్చే గ్యాస్ క్యారియర్లకు సురక్షితమైన మార్గాన్ని కల్పించామని స్పష్టం చేశారు. వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ (IANS) తో ఆయన మాట్లాడుతూ.. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మొదటి నుంచి భారత్‌కు మిత్రదేశంగా, భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ప్రజలు గ్యాస్ కొరతను ఎదుర్కోవడం చూసి ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్‌గా నేను తీవ్రంగా కలత చెందాను’ అని అన్నారు. ‘ప్రస్తుతం అక్కడ పరిస్థితులు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. గ్యాస్ క్యారియర్లకు ఇలాంటి పరిస్థితుల్లో ముప్పు ఎక్కువ. చిన్న ప్రమాదం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అయినప్పటికీ, దేవుడి దయ వల్ల ఈ నౌకలు భద్రంగా దాటేలా ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించింది. ఇది భారత్‌తో మాకున్న స్నేహానికి, సంఘీభావానికి నిదర్శనం’ అని ఆయన వివరించారు.
తీరానికి చేరుకున్న నౌకలు
పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా భారత్‌లో ఎల్పీజీ కొరత ఏర్పడిన వేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో వస్తున్న భారతీయ నౌక ‘జగ్ లాడ్కి’ (Jag Laadki) గుజరాత్ తీరానికి చేరుకుంది. అంతకుముందు, ఖతార్ నుంచి 40,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్‌తో వస్తున్న ఎల్పీజీ ట్యాంకర్ ‘శివాలిక్’ (Shivalik) యుద్ధ వాతావరణం నెలకొన్న హార్ముజ్ జలసంధిని దాటి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హార్ముజ్ జలసంధికి పశ్చిమంగా మొత్తం 22 భారతీయ నౌకలు ఉన్నాయి.
కీలకమైన హార్ముజ్ జలసంధి
ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశం భారత్. తన చమురు అవసరాల్లో 88 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్ రోజుకు 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుండగా, అందులో 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్లు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి పశ్చిమాసియా దేశాల నుంచి హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వినియోగించే 55 శాతం వంట గ్యాస్ (LPG), విద్యుత్, ఎరువులు, సీఎన్‌జీకి ఉపయోగించే 30 శాతం ఎల్ఎన్‌జీ (LNG) ఈ మార్గం గుండానే సరఫరా అవుతుండటం గమనార్హం.






