- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిశు మరణాల తగ్గింపులో భారత్ రికార్డ్.. ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు
శిశు మరణాల తగ్గింపులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శిశుమరణాల రేటును తగ్గించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి కితాబిచ్చింది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల తగ్గింపులో భారత్ నిరంతరంగా పెద్ద ఎత్తున కృషి చేసినట్లు తాజాగా ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్ (UNIGME) 2025 నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో భారత్ చేపట్టిన భారీ స్థాయి ఆరోగ్య సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. గడిచిన రెండు దశాబ్దాలుగా దక్షిణాసియా ప్రాంతంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, 1990తో పోలిస్తే ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 76 శాతం తగ్గగా, 2000 సంవత్సరం నుండి ఈ తగ్గుదల 68 శాతంగా నమోదైందని పేర్కొంది. ఈ భారీ మార్పులో భారతదేశం కీలక పాత్ర పోషించిందని ప్రశంసించింది. 2000 సంవత్సరంలో ప్రతి 1,000 మంది సజీవ జననాలకు 92 గా ఉన్న మరణాల రేటు, 2024 నాటికి 32 కి తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ పథకాలే ఈ విజయానికి పునాదులు:
చాలా వరకు శిశు మరణాలు సరైన చికిత్స లేదా నివారణ చర్యలతో అడ్డుకోవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది. భారత్ ముఖ్యంగా నిమోనియా, అతిసారం (డయేరియా), మలేరియా, పుట్టుకతో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోందని తెలిపింది. భారతదేశంలో అమలవుతున్న పలు ఆరోగ్య కార్యక్రమాలు ఈ విజయానికి పునాదిగా నిలిచాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సార్వత్రిక టీకా కార్యక్రమం (UIP) మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించబడ్డాయని గర్భిణీలు ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రోత్సహిస్తోందని ఆసుపత్రుల్లో ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల (SNCU) ఏర్పాటును ప్రశంసించింది. భారతదేశం ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే భవిష్యత్తులో ఈ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.






