Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు: ఆర్మీ చీఫ్

by S Gopi |

Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు: ఆర్మీ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా శనివారం పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో అలాంటి చర్యలకు ఆర్మీ కమాండర్లు అంతే ధీటుగా బదులిచ్చేందుకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆదివారం భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దిగితే, మనవైపు నుంచి దాడులు అంతకుమించిన స్థాయిలో ఉండాలని అన్నారు. అంతకుముందు రోజు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఒప్పందం జరగడానికి ముందే భారత ప్రభుత్వం భవిష్యత్తులో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానీ, పాకిస్తాన్ మాత్రం ఒప్పంద ప్రకటన తర్వాత కూడా సరిహద్దు గ్రామాల్లో కాల్పులకు తెగబడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పశ్చిమ సరిహద్దు ఆర్మీ కమాండర్లతో భద్రతకు సంబంధించి పరిస్థితులను సమీక్షించారు. ఈ విషయాన్ని భారత సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మే 10న డీజీఎంఓ చర్చల ఫలితంగా కుదిరిన అవగాహనను ఉల్లంఘించడంతోనే 'కైనటిక్ యాక్షన్ ' కింద ఆర్మీ కమాండర్లౌకు పూర్తి అధికారాలు ఇచ్చినట్టు సైన్యం పేర్కొంది. కైనటిక్ యాక్షన్ అనేది ఏ సందర్భంలోనైనా సరే సైన్యం కదలికలను, ఆయుధాలను వాడే చర్యను సూచిస్తుంది.

Next Story