Rafale Marine aircraft: భారత్- ఫ్రాన్స్ మధ్య కుదిరిన బిగ్ డీల్

by Shamantha N |

భారత్- ఫ్రాన్స్ మధ్య బిగ్ డీల్ కుదిరింది. 26 యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి.

Rafale Marine aircraft: భారత్- ఫ్రాన్స్ మధ్య కుదిరిన బిగ్ డీల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- ఫ్రాన్స్ మధ్య బిగ్ డీల్ కుదిరింది. 26 యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి. 26 రఫేల్‌ ఎం (మెరైన్‌) శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్‌ సోమవారం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ మేరకు సంతకాలు జరిగాయి. డీల్‌ విలువ రూ.63 వేల కోట్లు. ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. వీటిల్లో 22 సింగిల్‌ సీటర్‌ జెట్లు కాగా.. నాలుగు ట్విన్‌ సీటర్‌ ట్రైనర్లు. అంతేకాకుండా, ఆఫ్‌సెట్ బాధ్యతల కింద ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, సిబ్బంది శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందుకుంటుంది. ఈ ఒప్పందంలో నేవీ సిబ్బందికి శిక్షణ కూడా ఉంది. ఈ మొత్తం డెలివరీలు 2031 నాటికి పూర్తవుతాయని అంచనా. ఇకపోతే, 2023, జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్-ఎం జెట్‌ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. కాగా.. ఇప్పుడు సంతకాలు అయ్యాయి.

అత్యాధునిక ఫైటర్ జెట్స్

ప్రపంచంలో నౌకాదళాలు వినియోగించే అత్యాధునిక ఫైటర్‌ జెట్లలో ఒకటిగా రఫేల్‌ ఎంను పరిగణిస్తారు. దీనిలో శాఫ్రన్‌ గ్రూప్‌ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్‌ఫోర్స్‌డ్‌ ల్యాండింగ్‌ గేర్స్‌ వాడారు. ఇది విమానవాహక నౌకలపై దిగడానికి వీలుగా ఉంటాయి. ఈ విమానాల విగ్స్ కు మడతపెట్టే సౌకర్యం కూడా ఉంది. ఈ విమానాలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై భారత్‌ మోహరించనుంది. ప్రస్తుతం వాడుతున్న మిగ్‌ 29ల స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. కాగా.. ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను వాడుతోంది. అయితే, నేవీ కూడా వీటిని కొనుగోలు చేయడంతో రెండు దళాల మధ్య సమన్వయం మరింత పెరగనుంది. బడ్డీ-బడ్డీ రీఫ్యూయలింగ్‌కు అవకాశం ఉంటుంది. ఓ ఫైటర్‌ జెట్‌ రీఫ్యూయలింగ్‌ పాడ్‌ సాయంతో మరో ఫైటర్‌ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా అంటారు. అప్పుడు భారీ ఫ్యూయల్‌ ట్యాంకర్‌ విమానాల అవసరం ఉండదు. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. ఈ యుద్ధ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడతాయి. పొరుగువారి నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు గతంలోనే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు.

Next Story