- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలోకి కెనడా.. స్వాగతించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రధానులు మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
కెనడా గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో, అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రకటించారు. కెనడా నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-కెనడా మధ్య ఆర్థిక సంబంధాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని ప్రకటించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (CEPA) త్వరలోనే ఖరారు చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భారత వృద్ధిపై నమ్మకంతో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ ఇప్పటికే $100 బిలియన్లను మన దేశంలో పెట్టుబడిగా పెట్టాయని మోదీ గుర్తుచేశారు.
వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం (Strategic Energy Partnership)
క్లీన్ ఎనర్జీ రంగంలో సహకారం కోసం కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. గాలి, సౌర మరియు హైడ్రోజన్ శక్తి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. 2050 నాటికి తమ విద్యుత్ గ్రిడ్‌ను రెట్టింపు చేయాలన్న కెనడా లక్ష్యంలో భారత్ కీలక భాగస్వామి కానుంది.
రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం
రక్షణ రంగంలో సంబంధాలను బలోపేతం చేసేందుకు 'డిఫెన్స్ డైలాగ్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు AI (కృత్రిమ మేధస్సు), అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లోనూ కొత్త ఒప్పందాలు జరిగాయి. స్పేస్ టెక్నాలజీ, సెక్యూరిటీ రంగాల్లో కూడా లోతైన సహకారం ఉంటుందని కెనడా ప్రధాని కార్నీ స్పష్టం చేశారు. అలాగే భారత్‌లో కెనడియన్ విశ్వవిద్యాలయాలు, తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాల్లోని ఆదివాసీ, గిరిజన వర్గాల సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకునేందుకు ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
భారత ఆర్థిక వ్యవస్థపై కార్నీ ప్రసంశలు
భారత ఆర్థిక వ్యవస్థపై మార్క్ కార్నీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. భారతీయుల తలసరి ఆదాయం పెరిగిన వేగం మానవ చరిత్రలోనే అరుదైనదిగా చెప్పారు. 2023లో జరిగిన భారత G20 అధ్యక్షతన ఉన్న 'వసుదైక కుటుంబం' (One Earth, One Family, One Future) థీమ్ ప్రస్తుత ప్రపంచ సవాళ్లకు సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.
గడిచిన ఏడాది కాలంలో భారత్, కెనడా ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలు, గత రెండు దశాబ్దాలలో జరిగిన మొత్తం చర్చల కంటే ఎక్కువ అని తెలిపారు. ఇది కేవలం పాత సంబంధాల పునరుద్ధరణ మాత్రమే కాదని, ఒక 'నవశకానికి నాంది' అని ఆయన అభివర్ణించారు.






