ఈసీని కలిసిన ఇండియా కూటమి సభ్యులు

by S Gopi |

కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్-1961లోని సెక్షన్ 54ఏ ఆధారంగా తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలని డిమాండ్ చేశారు.

ఈసీని కలిసిన ఇండియా కూటమి సభ్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లను మొదట లెక్కించాలని, వాటి ఫలితాలు ప్రకటించిన తర్వాతే ఈవీఎంలను తెరవాలని ప్రతిపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ)ని కోరారు. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్-1961లోని సెక్షన్ 54ఏ ఆధారంగా తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల పాటు ఈ నిబంధనను ఈసీ అమలు చేస్తోందని, అయితే 2019 ఎన్నిల నాటి నుంచి దీన్ని పట్టించుకోవట్లేదన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలంటే దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అభిషేక్ సింఘ్వి.. 'ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం, వాటి ఫలితాలు ప్రకటించడం చాలా ముఖ్యం. తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించాలని చట్టం చెబుతోంది. ఈ నిబంధనను అమలు చేయాలని ఈసీని కోరాం. 2023లో మధ్యప్రదేశ్, చట్టీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఏ ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేయలేదు. బెంగాల్‌లో కూడా చెప్పిన స్థాయిలో బీజేపీ గెలవలేదు. ఎగ్జిట్ పోల్ కంటే పీపుల్స్ పోల్స్ ముఖ్యం. మా అంచనాలో 290-295 సీట్లను గెలుస్తామని' పేర్కొన్నారు.

Next Story