భారత్, పాక్ ఉద్రికత్తలు.. మొబైల్‌ టార్చి వెలుగులో పెళ్లి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-11 06:30:50  IST  )

భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

భారత్, పాక్ ఉద్రికత్తలు.. మొబైల్‌ టార్చి వెలుగులో పెళ్లి
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ (Operation sindoor) చేపట్టింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ గురువారం అర్థ రాత్రి నుంచి భారత పౌరులే లక్ష్యంగా సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడుతోంది. వీటిని భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బ్లాక్ అవుట్ (Black out) విధించారు.

బ్లాక్ అవుట్ విధించిన ప్రాంతాల్లో రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌లోని పావ్టా ప్రాంతం కూడా ఉంది. అయితే, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ఓ పెళ్లి వేడుక జరిగింది. సరిగ్గా సప్తపది ప్రారంభమయ్యే సమయానికి బ్లాక్ అవుట్ కారణంగా ఒక్కసారిగా లైట్లన్నీ ఆరిపోయాయి. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు వెలిగించిన సెల్‌ఫోను లైట్ల (Mobile lights) వెలుతురులోనే వధూవరులు ఏడు అడుగులు నడిచారు. తర్వాత పురోహితుడు మంత్రాలు చదువుతూ మిగతా వివాహ ఆచారాలను కూడా అదే వెలుతురులో పూర్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ భద్రతలే ముఖ్యమని, అందుకు అధికారులకు, భారత ఆర్మీకి ప్రజలంతా సహకరించాలని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story