- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల విరమణకు ప్రపంచం హర్షం.. ఈ సమస్యల సంగతేంటి?
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే కొన్ని కీలక సమస్యలు మాత్రం అలాగే ఉండనున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: గురితప్పని భారత్ దాడులతో దెబ్బ మీద దెబ్బ తిన్న పాకిస్తాన్.. కాల్పుల విరమణకు దిగొచ్చింది. భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్ (డీజీఎంవో)కు ఫోన్ చేసిన పాకిస్తాన్.. కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఈ డీల్‌లో తామే మధ్యవర్తిత్వం చేశామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 48 గంటలుగా ఇరు దేశాల నేతలతో చర్చలు జరిపి, చివరకు కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిగేలా చూశామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రుబియో వెల్లడించారు. ఈ విషయంలో రుబియో చాలా కష్టపడ్డారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చెప్పారు.
ఈ సమస్యల పరిస్థితేంటి?
అయితే ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఒప్పుకున్నా కూడా.. ఇరుదేశాల మధ్య ఎన్నో విషయాలపై చర్చలు జరగాల్సి ఉంది. కాల్పుల విరమణ జరిగినా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించడం లేదని, అది ప్రస్తుతానికి రద్దయ్యే ఉంటుందని భారత్ చెప్పింది. అలాగే పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, అట్టారీ-వాఘా బోర్డర్ మూసివేత, వంటి సమస్యలు ఇంకా అలాగే కొనసాగనున్నాయి. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ కారిడార్ కూడా ప్రస్తుతానికి మూసివేసే ఉంచారు. వీటన్నింటి గురించి ఈ నెల 12న ఇరు దేశాల ప్రతినిధులు మధ్య జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ప్రపంచం హర్షం..
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరగడంపై ప్రపంచ దేశాలు హర్షం ప్రకటించాయి. ‘ఈ నిర్ణయానికి భారీ స్వాగతం పలుకుతున్నా. రెండు దేశాలు దీన్ని కొనసాగించాలి. ఇది అందరికీ మంచిది’ అని యూకే ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లామీ అన్నారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ కూడా సమస్యను పెద్దది కాకుండా చూసే అన్ని చర్యలను తాము స్వాగతిస్తామని చెప్పారు. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాలని ఈయూ ప్రతినిధి కజా కల్లాస్ అన్నారు. ఈ ఒప్పందం చాలా కీలకమైన మొదటి అడుగు అని జర్మనీ తెలిపింది.






