India alliance: ‘ఇండియా’ కూటమి వెంటిలేటర్‌పై ఉంది.. ఒమర్‌ అబ్దుల్లా మరోసారి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-12-06 10:48:56  IST  )

బీజేపీ ఎన్నికల్లో పోరాడే తీరుపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

India alliance: ‘ఇండియా’ కూటమి వెంటిలేటర్‌పై ఉంది.. ఒమర్‌ అబ్దుల్లా మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటిగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి తీరుపై జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir CM) సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని ఇకనైనా విపక్ష కూటమి విభేదాలను పక్కన పెట్టాలని అన్నారు. ఇవాళ 23వ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల్లో గెలిచే యంత్రంగా అవతరించిందని ఎన్డీయేను ఎదుర్కొనే విషయంలో ఇండియా కూటమి (INDIA Alliance) సామర్థ్యాన్ని అబుద్దుల్లా ప్రస్తావించారు. మనమనంతా ఓ కూటమిలో ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా సమిష్టిగాఉండాలి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నుంచి జేఎంఎం బయటకు వెళ్లిపోయిందని దీనిపై ఎవరిని నిందించాలని ప్రశ్నించారు. గతంలో జేడీయూ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోవడానికి కూటమిలోని భాగస్వాములు సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కారణం అని అబ్దుల్లా ఆరోపించారు.

బీజేపీపై ప్రశంసలు:

మిత్రపక్షాలు కలిసి రాకపోతే అవి రాష్ట్ర కూటమిగానే ఉంటాయని అబ్దుల్లా హెచ్చరించారు. బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహాలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఆ పార్టీకి అసమానమైన ఎన్నికల యంత్రం, సంస్థ, డబ్బు ఉందని అయినా వారు ఆ శక్తిని ప్రతిదానిపై పెట్టరని అన్నారు. పార్టీ తన జీవితం ఎన్నికలపై ఆధారపడి ఉందనేలా చిన్న స్థాయి నుంచి రాష్ట్రపతి పోస్టు కోసం జరిగే ఎన్నిక వరకు పోరాడుతుందని బీజేపీ ఎన్నికల్లో పోరాడే తీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి, ఆయన సహచరులు అనుసరించే 24/7 రాజకీయాలకు ప్రతిపక్ష నాయకులు కట్టుబడి లేరని అన్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రతిపక్ష సంకీర్ణం కాంగ్రెస్ చుట్టూ పెరగాల్సి ఉంటుందని ఎందుకంటే మిగిలిన భాగస్వామ్య పార్టీలన్ని ఒక రాష్ట్రానికే పరిమితం అని అన్నారు.

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత రాష్ట్ర కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీరీలను విదేశీయులతో సమానం చేసి వారిని సమీప పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని కోరడాన్ని అబ్దుల్లా విమర్శించారు. ఒకే సమాజాన్ని ఒకే కుంచెతో చిత్రించలేరని అందరూ ఉగ్రవాదులు కాదన్నారు. ముస్లింలను ఇలా వేరు చేయడం వల్ల మెరుగైన విద్య, ఆర్థిక అవకాశాల కోసం జమ్మూ కాశ్మీర్‌ను విడిచి వెళ్ళమని యువకులను ఒప్పించడం కష్టమవుతుందని చెప్పారు. స్వదేశంలో పెరిగిన ఉగ్రవాదం తిరిగి పుంజుకోవడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం ముగిసిందని భావించడం తప్పుడు ఆలోచన అని అన్నారు. రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాన్ని పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రిని నేనే అని చెప్పారు. ఢిల్లీ పేలుడు వివరాలు ఆ తర్వాత జరిగిన దర్యాప్తు వివరాలను తాను పత్రికల ద్వారా తెలుసుకున్నానని గతంలో జరిగినట్లుగా స్థానిక పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏం జరిగి ఉండేదో, పోలీసులు నాకు ఫోన్ చేసి ఏమి జరిగిందో చెప్పేవారు. దర్యాప్తు గురించి వారు నాకు సమాచారం అందించేవారన్నారు.

Next Story