- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సమయంలో తప్పుదారి పట్టించే కథనాలు సరికావు
పోలింగ్ ఎక్కువగా జరిగే సందర్భంలో, అలాగే కౌంటింగ్ నిర్వహించే సమయంలో కొంత మంది కావాలనే తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచారం చేస్తున్నారు.

- ఈ తరహా థోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది
- ఫలితాలను అంగీకరించని వారే ఈసీని నిందిస్తున్నారు
- రిమోట్ ఓటింగ్ ప్రవేశ పెట్టాలి
- వీడ్కోలు ప్రసంగంలో సీఈసీ రాజీవ్ కుమార్
- మంగళవారంతో ముగియనున్న పదవీ కాలం
దిశ, నేషనల్ బ్యూరో:
ఎన్నికల సమయంలో తప్పుదోవ పట్టించే కథనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కథనాలను నమ్మే వాళ్లు ఎన్నికల ఫలితాలను కూడా అంగీకరించడం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం 25వ సీఈసీగా రెండున్నర ఏళ్ల కంటే ఎక్కువ సమయం పని చేసిన రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పదవీ కాలంలో ఎదుర్కున్న సవాళ్లు, రాబోయే రోజుల్లో తీసుకొని రావల్సిన సంస్కరణలపై మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్‌పై చేసే ప్రేరేపిత దాడుల వల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోలేము. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇలాంటి దాడుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ కుమార్ కోరారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్ల లిస్టులో జరిగే అక్రమాలు, ఈవీఎం ట్యాంపరింగ్, ఓటింగ్ శాతంలో జరిగే అవకతవకలను ప్రశ్నిస్తున్నాయి. ఇవి చాలా ఆందోళన కలిగించే అంశాలని రాజీవ్ కుమార్ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఇవి తగదు
ఎన్నికలు సమయంలో.. ముఖ్యంగా పోలింగ్ ఎక్కువగా జరిగే సందర్భంలో, అలాగే కౌంటింగ్ నిర్వహించే సమయంలో కొంత మంది కావాలనే తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచారం చేస్తున్నారు. నిజాలను దాచి పెట్టి ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారు. దీని వల్ల ఎన్నికల ఫలితాలను చాలా మంది నమ్మడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ పరిమితుతోనే పని చేస్తున్నప్పుడు.. ఇలాంటి తప్పుడు వ్యూహాలను అనుసరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాజీవ్ కుమార్ చెప్పారు. పోలింగ్, కౌంటింగ్ జరిగే సమయంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా కొన్ని రూమర్లు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని వల్ల ప్రజలు అయోమయానికి గురవడమే కాకుండా.. నిజాలను తెలుసుకోలేక పోతున్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు స్పందించ వద్దని ఎన్నికల కమిషన్ నిర్ణయించుకుంది. ఆ సమయంలో కేవలం ఎన్నికలు సజావుగా సాగాలనే విషయం పైనే మా దృష్టి ఉంటుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
స్వేచ్ఛాయుత ఎన్నికలే ప్రజల నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. ఎన్నికల ప్రక్రియపై కావాలని చేసే దాడులు ప్రజల నమ్మకాన్ని కదిలించలేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పాల్గొనే 1.5 కోట్ల మంది అధికారులు స్వేచ్ఛాయుతంగా, సజావుగా సాగాలని కోరుకుంటారు. తద్వారా ప్రజల నమ్మకాన్ని వారు చూరగొనాలని అనుకుంటారు. ఇది మన 75 ఏళ్ల ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్నిపెంచుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
రిమోట్ ఓటింగ్ నా ఆకాంక్ష..
ఎన్నికల సమయంలో దూరంగా ఉండే ఎన్ఆర్ఐలు, వలస కార్మికులు కూడా ఓటు హక్కును సులభంగా ఉపయోగించుకోవడానికి రిమోట్ ఓటింగ్ (ఆన్‌లైన్ ఓటింగ్) ప్రవేశపెట్టాలనేది తన ఆకాంక్ష అని రాజీవ్ కుమార్ చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించడమే కాకుండా.. పోలింగ్ తర్వాత ఎవరికి ఓటేశామన్నది రహస్యంగా ఉంచాలని.. తద్వారా ఫలితాల తర్వాత జరిగే హింసను అరికట్ట వచ్చని రాజీక్ కుమార్ చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చ విషయంలో ఆర్థిక పారదర్శకత ఉండాలని అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చే వాగ్దానాల విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. ఇది ఎన్నికల సరళిని విప్లవాత్మకంగా మార్చబోతున్నట్లు రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల నిర్వహణలో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉందో, మన ఎలక్షన్ వ్యవస్థ నైపుణ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలుసు. మన నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.






