- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Elections: ఢిల్లీలో 11 నియోజకవర్గాల సెంటిమెంట్.. అక్కడ గెలిచే పార్టీదే అధికారం!
సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఏదైనా పార్టీ గెలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తుందని కానీ.. లేదా గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుందనే సెంటిమెంట్ ఉంటుంది.

- మూడు దశాబ్దాలుగా తప్పని అంచనాలు
- మరోసారి టార్గెట్ చేసిన ఆప్
దిశ, నేషనల్ బ్యూరో:
రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సమయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పోల్ స్ట్రాటజిస్టులతో పాటు పార్టీల అంతర్గత సమావేశాల్లో నాయకులు కొన్ని నమ్మకాలపై కూడా చర్చ జరుపుతుంటారు. అవే 'బెల్ వెదర్' సెగ్మెంట్లు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఏదైనా పార్టీ గెలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తుందని కానీ.. లేదా గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుందనే సెంటిమెంట్ ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి బెల్ వెదర్ నియోజకవర్గాలను గుర్తించి.. అక్కడి ప్రజల మూడ్‌ను రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు అంచనాలు వేసుకుంటాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న అక్కడ పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో 11 బెల్ వెదర్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఢిల్లీ పీఠం వారికే దక్కుతుందనే సెంటిమెంట్ ఉంది. 1993 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతుండటం గమనార్హం.
ఇవే ఆ 11 సెగ్మెంట్లు..
ఢిల్లీ అసెంబ్లీకి 1993 నుంచి జరిగిన ఎన్నికల్లో ఈ 11 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే.. అదే అధికారంలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఒకటి రెండు అటు ఇటూ అయినా.. ఈ 11 సెంటిమెంట్ మాత్రం మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. న్యూ ఢిల్లీ (2003కు ముందు గోల్ మార్కెట్), మాల్వియా నగర్, మాదిపూర్, పాత్పర్‌గంజ్, గాంధీనగర్, చాందినీ చౌక్, తిమార్‌పూర్, మోడల్ టౌన్, సర్దార్ బజార్, పటేల్‌నగర్, కరోల్‌బాగ్ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేలు అయితే గెలుస్తారో.. వాళ్లు తప్పకుండా అధికారంలోకి వస్తారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015లో ఈ 11 నియోజకవర్గాల్లో ఆప్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఒక్క గాంధీనగర్ నియోజకవర్గం మినహా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు 20 వేల ఓట్లకుపైగా మార్జిన్‌తో గెలిచారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2013, 2015, 2020లో వరుసగా అర్వింద్ కేజ్రివాల్ గెలిచారు. అంతకు ముందు కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ వరుసగా మూడు సార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. పాత్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి గత మూడు పర్యాయాలు మనీష్ సిసోడియా గెలుపొందారు. అంతకు ముందు ఈ సీట్లో వరుగా కాంగ్రెస్ గెలిచింది. ఇక చాందినీ చౌక్ నుంచి గత రెండు ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులే గెలిచారు. అయితే 2015లో గెలిచిన ఆప్ అభ్యర్థి అల్కా లాంబా ఇప్పుడు కాంగ్రెస్ తరపున బరిలో ఉండగా.. గతంలో కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరి ఎమ్మెల్యే అయిన ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ మరోసారి తన లక్‌ను పరీక్షించుకుంటున్నారు.
గాంధీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1998 నుంచి 2013 వరకు వరుసగా ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన అర్వింద్ సింగ్ లవ్లీ గెలుపొందారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన అర్వింద్ సింగ్.. ఆ పార్టీ టికెట్‌పై గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఆప్ తరపున నవీన్ చౌదరి బరిలో ఉన్నారు. తిమర్‌పూర్‌లో గత మూడు ఎన్నికల్లో ముగ్గురు ఆప్ తరపున పోటీ చేశారు. అయితే వీరు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం గమనార్హం. అయితే ఈ సారి ఆప్ తరపున సురీందర్ పాల్ సింగ్ బిట్టూను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో సురీందర్ పాల్.. బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
మాదిపూర్‌లో ఆప్ మరోసారి గిరీశ్ సోనికి టికెట్ ఇచ్చింది. ఆయన 2013 నుంచి ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. కరోల్‌బాగ్ నియోజక వర్గం నుంచి మరోసారి విశేష్ రవి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన 34,315 ఓట్ల మార్జిన్ సాధించారు. సదర్ బజార్ నుంచి ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ్ దత్.. మాల్వియా నగర్ నుంచి ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ 11 నియోజకవర్గాలు కూడా గత ఎన్నికల్లో ఆప్ గెలిచినవే. ఈ సారి కనుక మళ్లీ ఆప్ ఇక్కడ నుంచి గెలిస్తే.. ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుందని స్ట్రాటజిస్టులు చెబుతున్నారు.






