Rahul Gandhi: ధనవంతులకు దోచి పెట్టడమే బీజేపీ మోడల్

by S Gopi |

ఈ సందర్భంగా లక్ష మంది పేద లబ్దిదారులకు టైటిల్ డీడ్‌లను పంపిణీ చేశారు.

Rahul Gandhi: ధనవంతులకు దోచి పెట్టడమే బీజేపీ మోడల్
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడం కాంగ్రెస్ మోడల్ అయితే, ధనవంతులకు దోచి పెట్టడమే బీజేపీ మోడల్ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా లక్ష మంది పేద లబ్దిదారులకు టైటిల్ డీడ్‌లను పంపిణీ చేశారు. 'కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నికల సమయంలో, మేము ప్రజలు వాగ్దానాలు చేశాం. ఐదు గ్యారెంటీలు ఇచ్చాము. కానీ, అవి సాధ్యమయ్యే హామీలు కావని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు అన్నారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసి చూపించింది. పేదల బ్యాంకు ఖాతాల్లో నగదును నేరుగా వేస్తున్నాం. ఇప్పటివరకు వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ఆ సొమ్ము ప్రజలు, వారి పిల్లల చదువులకు, ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కోరుకుందని' రాహుల్ గాంధీ అన్నారు.

ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే చేరాలని బీజేపీ భావిస్తుంది. బిలీయనీర్ల కోసం మోడీ ఆరాటపడుతుంటారు. కానీ, ఆ డబ్బు నేరుగా పేదలు, వెనుకబడినవారు, దళితులు, ఆదివాసీల జేబుల్లోకి వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. తాము ప్రజల జేబుల్లో డబ్బు వేస్తే, అది మార్కెట్లోకి వస్తుంది. ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది. అది కర్ణాటక ఆర్థికవ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీ మోడల్‌లో మొత్తం డబ్బు ఇద్దరు, ముగ్గురు బిలీయనీర్లకు ఇస్తారని, వారు ఆ సొమ్మును గ్రామాలు, పట్టణాల్లో ఖర్చు చేయరు. కానీ లండన్, న్యూయార్క్, విదేశాల్లో ఆస్తులను కొనేందుకు వాడుకుంటారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాల, పార్టీ నేతలు, మంత్రులు పాల్గొన్నారు.

Next Story