Health : అజీర్తి సమస్య వేధిస్తోందా? హైపోక్లోర్‌హైడ్రియా కావచ్చు!

by Javid Pasha |

సాధారణంగా ఆహారం జీర్ణంకాకపోవడం అనేది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంతగా ఉత్పత్తి కాకపోవడంవల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Health : అజీర్తి సమస్య వేధిస్తోందా? హైపోక్లోర్‌హైడ్రియా కావచ్చు!
X

దిశ, పీచర్స్ : మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి, ఫైబర్‌రిచ్ ఫుడ్ తగ్గించడం వంటి కారణాలతో ఇటీవల పలువురిలో జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది చివరకు ‘హైపోక్లోర్‌హైడ్రియా’ అనే ఇబ్బందికరమైన జీర్ణ సమస్యకు దారితీస్తున్నదని చెబుతున్నారు. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు కొంచెం తినగానే ఫుల్లుగా తిన్నట్లు కడుపు నిండిన అనుభూతికి లోనవుతుంటారు. దీంతో సరిగ్గా పోషకాలు అందరక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణాలేమిటి? పరిష్కారమేమిటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

హైపోక్లోర్‌హైడ్రియా అంటే?

సాధారణంగా ఆహారం జీర్ణంకాకపోవడం అనేది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంతగా ఉత్పత్తి కాకపోవడంవల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితినే హైపోక్లోర్‌హైడ్రియా అని పిలుస్తారు. అంటే యాసిడ్ తక్కువగా రిలీజ్ అవడం వల్ల, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో ఆహారం ద్వారా శరీరానికి అందవలసిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సరిగ్గా అందవు. ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కారణం ఇదే

కడుపులో మంట లేదా అసౌకర్యం కలిగినప్పుడు ‘ఆమ్లం ఎక్కువైంది’ అనుకుంటారు చాలామంది. కానీ తక్కువ స్థాయి ఆమ్లం కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపోక్లోర్‌హైడ్రియా కూడా అలాంటిదే. శరీరంలో ఇది సాధారణ స్థాయికంటే తక్కువైనప్పుడు పోషకాహార లోపాలు, బలహీనత, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి స్టమక్ యాసిడ్ సరైన మోతాదులో ఉండటం కూడా చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇది హారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. హానికారక బ్యాక్టీరియాను చంపి, శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ (కడుపు లైనింగ్ దెబ్బతినడం), H. pylori బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా దీర్ఘకాలిక వాపు వంటివి హైపోక్లోర్‌హైడ్రియా రావడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు వయసు పెరగడం, అజీర్తి సమస్యలు తలెత్తిప్పుడు ఆమ్లం తగ్గించే మందులు ఎక్కువగా వాడటం లేదా యాంటాసిడ్స్, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి ఇందుకు కారణం అవుతాయి.

లక్షణాలు

*సాధారణ లక్షణాల విషయానికి వస్తే కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, త్రేన్పులు

*ఆహారం కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నట్లు, కడుపు నిండకపోయినా నిండినట్లు అనుభూతి చెందడం లేదా ఆకలి మందగించడం

*హార్ట్ బర్న్, మలబద్ధకం, విరేచనాలు, అలసట, జుట్టు రాలడం, గోళ్లు పల్చబడటం, అనీమియా

పరిష్కారం ఏమిటి?

ముందుగా సమస్యను డాక్టర్లు నిర్ధారించాలి. అందుకోసం H. pylori టెస్ట్, ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఒకవేళ మీకు యాంటాసిడ్స్ అవసరం లేకపోతే డాక్టర్ సలహాతో వెంటనే ఆపేయాలి. ఆహారంలో మార్పులు, అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. అందుకోసం యోగా, సరైన నిద్ర, పలు ఇతర వ్యాయామాలు చేయవచ్చు. డాక్టర్ సూచన మేరకు బీటైన్ HCl + పెప్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలు మానుకోవాలి. ఇక ఆహారాల విషయానికి వస్తే యాపిల్ సైడర్ వెనెగర్ నీటిలో కలిపి భోజనానికి ముందు తాగడం, అల్లంతో తయారు చేసిన ఆహారాలు, అల్లం టీ తీసుకోవడం, లీన్ ప్రోటీన్, గింజలు, మితంగా మాంసం, ఇతర తాజా ఆహారాలు, కూరగాయలు తీసుకోవచ్చు. అధిక చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story