Bihar: బిహార్ అసెంబ్లీలో గందరగోళం.. డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం

by Shamantha N |

బిహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Bihar: బిహార్ అసెంబ్లీలో గందరగోళం.. డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరి తండ్రిపై మరొకరులు విమర్శలు చేసే స్థాయికి దిగజారిపోయారు. సామ్రాట్ చౌదరి తండ్రి(శకుని చౌదరి) ర్యాలీలో వాడిన భాషను తేజస్వి ప్రస్తావించారు. మీ తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) రాష్ట్రాన్ని దోచుకున్నారని, తనని జైలుకి పంపారని సామ్రాట్ చౌదరి దీటుగా బదులిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే లాలూ యాదవ్ సర్కారు ఎంతో మెరుగ్గా ఉందని తేజస్వి చెప్పుకొచ్చారు. గతంలో సీఎం నితీశ్ పై.. డిప్యూటీ సీఎం సామ్రాట్, ఆయన తండ్రి చేసిన విమర్శలను గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు వారిద్దరికీ నితీశ్ బాస్ అని ఎద్దేవా చేశారు. తేజస్వి మాట్లాడుతూ.. "ప్రభుత్వం పని అయిపోయింది. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. సీఎం అలసిపోయి ఓడిపోయారు. సామాన్యులు నిస్సహాయంగా తిరుగుతున్నారు. ఇంకో 40 ఏళ్లు అధికారంలో కొనసాగినా.. 2055కి ముందు ఉన్నట్లే ఆరోపణలు చేస్తూనే ఉంటారు" అని అన్నారు. గతంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం ఇప్పుడేం చేస్తున్నారు అని ప్రశ్నించారు.

సామ్రాట్ చౌదరికి సవాల్

నితీశ్ కుమార్ ని మీతండ్రి విమర్శించలేదా అని సామ్రాట్ చౌదరికి తేజస్వి సవాల్ విసిరారు. ఆయనపై పరుషపదజాలం వాడలేదంటే దాన్ని ఖండించండని ఛాలెంజ్ చేశారు. కాగా.. ఆర్జేడీ నేత విమర్శలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో, తేజస్విపై సామ్రాట్ చౌదరి విరుచుకుపడ్డారు. ఆయన్ని ఉద్దేశిస్తూ.. “మీతండ్రి ఏం చేశారు. బిహార్ ని దోచుకున్నారు. పేదలను దోచుకున్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు” అని అన్నారు. "మిమ్మల్ని మీరు రాజుగా భావిస్తున్నారా?" అని ఆర్జేడీ నేతను ఎగతాళి చేశారు. "కనీసం నేను ఎలాంటి దుర్భాషలాడలేదు" అని డిప్యూటీ సీఎంకి తేజస్వి కౌంటర్ ఇచ్చిరా. మరోవైపు, దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి నేతృత్వంలోని ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి మంత్రిగా ఉన్నారు. లాలు జైలుకు వెళ్లినప్పుడు సామ్రాట్ కూడా జైలుకు వెళ్లారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. 2014లో తిరుగుబాటు వర్గంలో భాగమయ్యారు. మరియు జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జేడీ(యూ) ప్రభుత్వంలో చేరారు. మూడేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. నితీశ్ సర్కారులో డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు.

Next Story